NTR Biggest Statue: శక పురుషుడు నందమూరి తారక రామారావు కు సంబంధించి ఏ చిన్న కార్యక్రమమైనా తెలుగువారికి పండుగ లాంటిదే. అవును ఇది నిజం. తెలుగు వారు ఎక్కడ ఉన్నా అన్నగారిని మరిచిపోరు. అయితే అమెరికాలో ఉన్న తెలుగు వారు అన్నగారి భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అందుకు సంబంధించి వడి వడిగా అనుమతులు తీసుకొని విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇక ప్రారంభోత్సవమే తరువాయి.
అట్లాంటా సెంటర్ లో కమ్మింగ్ నగరంలో నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్తుంది. ఈ విగ్రహాన్ని తన మనవడు నారా లోకేష్ 31న ఆవిష్కరించనున్నారు. ఇండియా నుంచి ఎమ్మెల్యేలతో పాటు అమెరికా నలుమూలల నుంచి ఎన్టీఆర్ అభిమానులు, నాయకులు తరలి వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
అక్టోబర్ 31, గురువారం, ఉదయం 11 గంటలకు కమ్మింగ్ నగరంలోని సానీ మౌంటైన్ ఫార్మ్స్ లో దీపావళి పండుగ రోజున విగ్రహావిష్కరణ ఉంటుంది. ఈ శుభ ఘట్టాన్ని వీక్షించి తెలుగు జాతి కీర్తి పతాకం తెల్లవారి నేలపై ఎగరేద్దాం రండి, తరలిరండి అంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు తెలుగువారందరికీ ఆహ్వానం పలికారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తోపాటు గుడివాడ ఎమ్మెల్యే రాము వెనిగండ్ల, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు యార్లగడ్డ, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరుకానున్నారు.