chiranjeevi : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో విలన్ పాత్రల నుంచి తన తరంలో టాప్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. తన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలను ప్రోత్సహిస్తుంటారు. తనకు ఏ సినిమా నచ్చిన ఇమేజ్ తో సంబంధం లేకుండా వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ అగ్ర దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ నిర్యాణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. అప్పటి నుంచి తనవంతుగా సినీ పరిశ్రమకు అండగా నిలుస్తున్నారు చిరంజీవి.
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా తాను ముందుంటానని మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నటీనటులకు సినిమాలతో పాటు ఇతర ఏ వ్యాపకాలు ఉన్నా వాటిని సినీ పరిశ్రమకు రుద్ద వద్దని పలు సందర్భాల్లో విన్నవించిన విషయం తెలిసిందే. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తున్నారని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెబుతుంటారు. సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న ఈ ఇండస్ర్టీకి సినీ పరిశ్రమతో పాటు ప్రభుత్వాలు కూడా రాయితీలు, అనుమతులు తొందరగా వచ్చేలా చూడాలని రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి వ్యతరేకంగా పోరాడుతున్న సమయంలోనూ సినిమాల రిలీజ్ కు సంబంధించి పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోలతో కలిసి సీఎం జగన్ కలిశారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ నుంచి కావాల్సిన సహకారాన్ని కోరారు.
అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ సీఎం జగన్ ను కలిసి అభినందించకపోయినా తానే స్వయంగా చొరవ తీసుకొని మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు. సినీ పెద్దలతో పాటు తాను ఒంటరిగా కలిసిన సందర్భాలు ఉన్నాయి.
సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇది ఒక ప్రైవేట్ పార్టీలా జరిపారు. చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఓ ప్రైవేట్ హోటల్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు అప్పుడప్పుడు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేస్తూనే తమ్ముడికి సపోర్ట్ గా నిలుస్తున్నారు మెగాస్టార్. అయితే తాజాగా చిరంజీవి డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అంబటి రాంబాబు బ్రో సినిమా పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా చిరంజీవి స్పందించినట్లు తెలుస్తున్నది.
అధికారంలో ఉన్న వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, అభివృద్ధి గురించి గానీ, కొత్త ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి ఆలోచించాలి. ఇలాంటి విషయాల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడుతన్నారు ఎందుకు? ఇదేదో పెద్ద సమస్యలా చూపించకండి అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.