MLA Kamineni : కైకలూరు కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కొల్లేరు నీటిలో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన కూటమి నేతలు, అధికారులు కిందికి దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన కైకలూరు మండలం పందిరి పల్లి గూడెం సమీపంలో చోటుచేసుకుంది. బుడమేరు వాగు కొల్లేరులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుడివాడ, కైకలూరు, కలిదిండి ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు భారీగా చేరింది. అంతేకాదు చేపలు, రొయ్యల చెరువులు నీట మునిగాయి.
కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులుగా పర్యటిస్తున్నారు. నష్టపోయిన గ్రామాలను పరిశీలిస్తున్నారు. బాధిత ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కామినేని పందిరిపల్లిగూడెం వెళ్తున్నారు. అయితే రోడ్డుపై ప్రవహిస్తున్న కొల్లేరు వరదలో ఆయన వాహనం చిక్కుకుపోయింది. వాహనం బురదలో కూరుకుపోవడంతో కామినేని శ్రీనివాసరావును భద్రతా సిబ్బంది తాళ్ల సహాయంతో బయటకు తీశారు. దీంతో ఆయనకు పెను ప్రమాదం తప్పడంతో మహాకూటమి నేతలు ఊపిరి పీల్చుకున్నారు.