Visakhapatnam News : ఆమె ఎలాంటి కపటాలు లేకుండా ప్రేమించింది. సహోద్యోగి అయిన అతడినే నమ్మింది. కానీ అతడు నమ్మించి మోసం చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. తరువాత పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులతో చెప్పించినా ఫలితం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో ఆమెను తుదముట్టించాలని ప్లాన్ వేశాడు.
నర్సీపట్నానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రుత్తల రత్నమాధురి (26) సోమవారం విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచింది. ఆస్పత్రిలో కొనఊపిరితో పోరాడి తొమ్మిరోజులకు ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబంలో విషాదం నింపింది. కోలుకుంటుందని భావించినా బంధుమిత్రులు ఆస్పత్రి వద్దే వేచి ఉన్నారు.
తన సహోద్యోగి అయిన నాతవరం మండలం వెన్నలపాలేనికి చెందిన వాసిరెడ్డి శేఖర్ ప్రేమించాడు. అతడి మాటలకు లొంగిపోయింది. మనువాడతానని చెబితే నమ్మేసింది. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకున్నాడు. గత నెల 27న వీరిద్దరు విశాఖ వెళ్లారు. ఆ రాత్రే మాధురిని శేఖర్ నర్సీపట్నం తీసుకొచ్చి తన ఇంట్లో దింపి వెళ్లిపోయాడు. మరునాడు ఆమె అస్వస్థతకు గురైంది.
దీంతో ఆమెను నర్సీపట్నం, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా కోలుకోలేదు. మాధురి బంధువులు శేఖర్ ను నిలదీశారు. మాధురి తిన్న ఆహారంలో విషం కలిసిందని తల్లి అమ్మాజీ ఫిర్యాదు చేసింది. ఎస్సై సుధాకర్ సోమవారం విశాఖ వెళ్లి బందువులతో మాట్లాడారు. మాధురి, శేఖర్ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో శేఖర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.