Adi Shankaracharya : 2536 సంవత్సరాల పూర్వం ఈ భూమండలం పైన సాక్షాత్తు పరమశివుడు ఆదిశంకరులుగా అవతరించారు. వారు జీవించిన కాలం కేవలం 32 సంవత్సరాలు,వారు ఈ విశ్వానికి ఈ ధర్మానికి చేసిన సేవ అనన్య సామాన్యం,ఇంక ఎవరూ చేయలేనిది , ఆ సేవలో భాగంగా,వారు 5 పీఠాలను స్థాపించారు. అవి పూరి ,ద్వారక, బదిరి ,శృంగేరి, కంచి. నాలుగు ఆమ్నాయ పీఠాలకు వారి ప్రధాన శిష్యులైన సురేశ్వర,హస్తామలక,తోటక,పద్మపాదాఆచార్యుల ను నియమించి వారు స్వయంగా కంచి కామకోటి పీఠంలో సర్వజ్ఞ పీఠాధిపతులుగా విరాజిల్లారు.
అటువంటి కంచి కామకోటి పీఠ పరంపరలో 70వ ఆచార్య పురుషునిగా మరలా వారే స్వయంగా అవతరించారు వారు ఎవరు అంటే వారే “జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి”
కొంతమందికి పీఠాధిపత్యం వల్ల వారికి యశస్సు ఖ్యాతి వస్తుంది మరి కొంతమంది పీఠాధిపత్యం వల్ల ఆ పీఠానికే యశస్సు ఖ్యాతి వస్తుంది,ఈ రెండవ కోవకు చెందిన వారే పరమాచార్య స్వామి వారు.
వారిని భక్తులు పరమాచార్య, మహాస్వామి , మహా పేరియవా గా పిలుచుకునేవారు,ఎందరో ఆచార్యులు ఉండవచ్చు కానీ పరమాచార్య ఒక్కరే,దేవుళ్ళు ఎంతమంది ఉన్నా మహాదేవుడొక్కడే, అలాగే స్వాములు ఎంతమంది ఉన్నా మహా స్వామి ఒక్కడే.నడయాడే దైవంగా భారతదేశాన్ని ఆసేతు హిమాచలం పర్యటించారు.
రామో విగ్రహవాన్ ధర్మః అన్న వాక్యం ఎంత సత్యమో! పరమాచార్య స్వామి వారు కూడా అంతే ధర్మ స్వరూపం,వారు పాదం ఎత్తితే ధర్మం పాదం దించితే ధర్మం, వారు ఈ జాతికి చేసిన సేవ ఈ ధర్మానికి చేసిన సేవ వారు తప్ప మరి వేరే ఎవ్వరూ చేయలేరు. వారి వయస్సు 13 సంవత్సరాలు ఉండగా, పీఠాధిపత్యం ఆయన కోరుకోకుండా ఆయనకు లభించింది, ఆయనకు పీఠాధిపత్యం ఇవ్వడానికి ఆయన పైన ఉన్న గురువు కాలం చేశారు వీరి పేరు చెప్పి వారికి పీఠాధిపత్యం ఇవ్వండి అని.
ఆయనకు సన్యాసి నియమాలు చెప్పడానికి కానీ,పీఠాధిపతిగా నియమాలు చెప్పడానికి కానీ
వారికి గురువుగా శరీరంతో ఎవరూ లేరు, ఒక రకంగా చెప్పాలంటే పరమాచార్య స్వామి వారు స్వయంవ్యక్త అవతారం,ఒక స్వయంభులింగంలాగా, తమంతకుతాముగా తమ పైన ఉన్న గురువులు ఇచ్చిన దండ కమండల కాషాయ వస్త్రాలు ధరించి కంచి కామకోటి సర్వజ్ఞ పీఠానికి 70వ ఆచార్యపురుషునిగా వెలుగొందారు.
13 ఏళ్ల వయస్సు నుంచి 100 సంవత్సరముల వయసు దాకా జీవించారు.వారి మాట ప్రమాణం, వారి ఉనికితో ఈ దేశాన్ని పావనం చేశారు. ఆది శంకర భగవత్పాదులు 32 ఏళ్ళ జీవించారు, అన్న కొదవ ఏ జగద్గురు శంకర భక్తుడికి ఉండిపోయిందో ఆ కొదవ తీర్చడం కోసమే మరలా ఆ పరమేశ్వరుడు అయిన శంకర భగవత్పాదులు కంచి కామకోటి పీఠం 70 వ పీఠాధిపతిగా అవతరించారు. వారి మూలంగానే ఈనాడు భారతదేశంలో వేదం నిలబడింది.అనేక వేల దేవాలయాలకు కుంభాభిషేకాలు చేశారు. వారి ఖ్యాతి భూమండలం అంతా వ్యాపించింది, వారిని ఆనాడు భారతదేశంలో దర్శించని రాజకీయ నాయకులు లేరు అంటే అతిశయోక్తి కాదు ఏమో, ఈనాడు రాజ్యాంగపరంగా హిందువులకు ఈమాత్రము హక్కులు ఉన్నాయి అంటే కారణం పరమాచార్య స్వామి వారి కృషి.పరమాచార్యులు అంటే వారిది మంత్రమయమైన శరీరం.
ఎంతటి తపోబలం ఎంతటి ఆత్మబలం ఉందో
వారి 84 సంవత్సరాల వయస్సులో రోజుకు దాదాపుగా 24 కిలోమీటర్లు నడిచేవారు, ధర్మం ధర్మం ధర్మం ఇదే వారి శ్వాస, ఆచారము ధర్మము శాస్త్రము వేదము ఎల్లప్పుడూ బోధించేవారు,ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన మహాపురుషులు,వారు ఎన్నో మహిమలు సిద్ధులు చూపించారు, కానీ వాటి కన్నా గొప్పదైన విభూతి ఒకటి వారి వద్ద మాత్రమే ఉండేది, అది ఏమంటే…వారి సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో తెలియని అలోకిక ఆనందం ఉండేది.
అది కేవలం వారి వద్ద మాత్రమే లభించేది,
వారి చిత్తరువును కాసేపు తదేకంగా చూసిన అది మనకు ఒక ధ్యానం,మనలోని ఎన్నో అశాంతులను పోగొట్టి శాంతికారమవుతుంది.వారి రూపానికి అంత శక్తి ఉంది.అటువంటి పరమాచార్య స్వామి వారు
మార్గశిర బహుళ ద్వాదశి నాడు శరీరాన్ని విడిచిపెట్టి బ్రాహ్మీబూతులయ్యారు.
జీవన్ముక్తులుగా నడయాడిన ఆ స్వామి వారిని ఈ దినమున వారి ఆరాధన సందర్భంగా నమస్కారం చేసుకుంటూ,వారు అడిగిన రెండు నిమిషాల దైవ నామస్మరణ బిక్షను వారి పాద పద్మాలకు అర్పిస్తూ
వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుందాము
హర హర శంకర జయ జయ శంకర..
*తోటకూర రఘు, ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు