
GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన తీరును సగటు టీడీపీ కార్యకర్త అస్సలు జీర్ణించుకోవడం లేదు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టీడీపీలో దక్కే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. కనీసం చైర్మన్ హోదాలో అధికారులను ఆదేశించడం .. మంచిగా పాలించడం కూడా తప్పేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీ రెడ్డి విషయంలో ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని ఓ టీడీపీ కార్యకర్త పేరిట రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది.
ఆ లేఖ సారంశంలో ఏముందుంటే.. ‘‘జీవీ రెడ్డి మావాడు అని గర్వంగా చెప్పుకొంటాం.. తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేసిన ఒక నిస్వార్థ నాయకుడు జీవీ రెడ్డి. ఆయన లాంటి చార్టెడ్ అకౌంటెంట్, అడ్వకేట్ మన పార్టీలోకి రావడం గర్వించదగిన విషయం. ఆయన అనుభవం, ఆర్థిక పరిజ్ఞానం, న్యాయపరమైన అవగాహన మన పార్టీకి ఎంతగానో ఉపయోగపడినాయి.
జీవీ రెడ్డి అంటేనే విషయ పరిజ్ఞానానికి దిక్సూచి, అర్థవంతమైన చర్చలకు నిలువుటద్దం. ప్రజలకు అవసరమైనది ఇలాంటి నాణ్యమైన ఆర్థిక మేథావులు. న్యాయంగా, స్పష్టంగా మాట్లాడే నాయకులు ఈ సమాజానికి ఎంతో అవసరం.
పార్టీ పెద్దలు ఆలోచించాలి
పార్టీకి సేవచేసిన నాయకులు వెళ్ళిపోతున్నప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నిజాయితీ గల నాయకుడిని, ప్రజలకు చేరువయ్యే మేధావిని కోల్పోవడం ఎంతో బాధాకరం. ఆత్మాభిమానం అంగట్లో దొరికే సరుకు కాదు. అది ఎన్టీఆర్ గారు మనకు ఇచ్చిన గొప్ప సంపద.
GV రెడ్డి గారు.. మీరు తీసుకున్న నిర్ణయం పూర్తిగా మీ వ్యక్తిగతం. అయితే, మీరు పార్టీ నుండి వెళ్ళిపోతున్నారని వినడం మాకెంతో బాధగా ఉంది. మీ అర్హత మీకు ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చింది. కానీ, మన పార్టీకి మీరు మరింత అవసరం.
– జీవీ రెడ్డి గారు మన పార్టీకి అవసరమే
తెలుగుదేశం పార్టీకి మీలాంటి విశ్లేషణాత్మకమైన ఆలోచన కలిగిన నాయకుల అవసరం ఉంది. మీ నిష్కల్మషమైన సేవలు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పార్టీ పెద్దలు దీనిపై ఆలోచించి, మీలాంటి నేతలను మనతో ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం.’’ అంటూ ఓ టీడీపీ కార్యకర్త పేరిట విడుదలైన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.






