- 2024 ఎన్నికల గ్రౌండ్ రిపోర్టు
టీడీపీ- పయ్యావుల కేశవ్
వైసీపీ- విశ్వేశ్వర్ రెడ్డి

Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం,. కర్ణాటకకు సరిహద్దున ఉన్న నియోజకవర్గం ఇది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్, రెండు సార్లు ఇండిపెండెంట్, ఒకసారి వైసీపీ విజయం సాధించాయి. బీసీ ఓటర్లు ఎక్కువ. ఐదు వేల చేనేత కుటుంబాలు ఉరవకొండలో ఉన్నాయి. బోయ,ముస్లింలు, చేనేత ఓటర్లు కీలకంగా ఉన్నారు. అత్యధికంగా బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు.
టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ కీలక నేతగా ఇక్కడ ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. 1994, 2004,2009, 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి పై ఓడిపోయారు. ఈ సమయంలో ఆయనను టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. శాసనమండలి విప్ గా కూడా చేసింది. మంచి వాగ్ధాటి ఉన్న నేతగా పయ్యావులకు పేరుంది. పయ్యావుల కేశవ్ కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. రాజకీయంగా ఆయన ఇక్కడ పటిష్టంగా ఉన్నారు. వ్యక్తిగతం పయ్యావుల కేశవ్ కు ఉన్న బలంతో పాటు 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు ఖరారైతే ఇది మరింత లాభిస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇక పయ్యావులకు తిరుగుండదని అంతా భావిస్తున్నారు.
వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కూడా బలమైన నేతగానే ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. వైసీపీ నుంచి ఉన్న విశ్వేశ్వర్ రెడ్డికి కూడా నియోజకవర్గంపై పట్టుంది. సౌమ్యుడిగా పేరుంది. అయితే వైసీపీలో వర్గపోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్సీ శివరాంరెడ్డికి మాజీ ఎమ్మెల్యేకు పొసగడం లేదనేది టాక్. విశ్వేశ్వర్ రెడ్డి గతంలో రెండుసార్లు ఓడిపోయారు. ఒకసారి గెలిచారు. అయితే వర్గపోరు వల్లే గత ఎన్నికల్లో కేవలం 2వేల ఓట్ల తేడాతో తాను ఓడిపోయినట్లు విశ్వేశ్వర్ రెడ్డి చెబుతుంటారు. విశ్వేశ్వర్ రెడ్డి కి తన కుటుంబానికే చెందిన మరో నేతతో కూడా విభేదాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇదే ప్రత్యర్థికి బలంగా మారుతుందని అంతా అనుకుంటున్నారు.
అయితే కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నా, టీడీపీ వైసీపీల పోరు ఉంటుందనేది ప్రజల మనోగతం. అధికార, ప్రధాన ప్రతి పక్షాలకు ఇక్కడ బలమైన నాయకులు, క్యాడర్ ఉంది. దీంతో పోరు ఇరు పార్టీల మధ్య ఉంటుందనేది చాలా మంది వాదన.
నియోజకవర్గం -ఉరవకొండ
జిల్లా – అనంతపురం
లోక్ సభ నియోజకవర్గం – అనంతపురం
మండలాలు-5
ఓటర్లు 215940(2019 ఎన్నికల ప్రకారం)
చెల్లుబాటైన ఓట్ల సంఖ్య -186756
టీడీపీ-90209
వైసీపీ-88077
తేడా-2132