Chandrababu Custody Petition :
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం తీర్పు ఇవ్వబోతున్నది. మరోవైపు ఆయన రిమాండ్ సమయం కూడా ముగుస్తున్నది. అయితే చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతున్నది. దీనిపై బుధవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును గురువారం ఉదయం వరకు వాయిదా వేశారు. మరోవైపు ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు కూడా మంగళవారం రిజర్వు అయ్యింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత పాత్రపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అయితే మరింత లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందని ఏపీ సీఐడీ న్యాయమూర్తికి విన్నవించింది. రూ. 371 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలున్నాయని చెబుతూ వస్తున్నది. అయితే చంద్రబాబును విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని సీఐడీ తరఫున ఏఏజీ తన వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలను చంద్రబాబు తరఫున వాదించిన సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తోసిపుచ్చారు. అసలు స్కాంలో చంద్రబాబు పాత్రనే లేదని, కేవలం కక్షపూరితంగా ప్రభుత్వం ఇందులో ఆయనపై అభియోగాలు మోపిందని వాదించారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ భద్రతలో ఉండే చంద్రబాబును అకారణంగా రాజమండ్రి జైలులో పెట్టారని మండిపడ్డారు.
ఇక ఇరువర్గాల వాదనలు బుధవారం పూర్తయ్యాయి. దీంతో తీర్పును గురువారానికి జడ్జి వాయిదా వేశారు. అయితే పీటీ వారెంట్లపై పిటిషన్లకు సంబంధించి ఒకేసారి విచారించాలని ఒత్తిడి తీసుకురావొద్దని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు అంగళ్లు కేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు పేరు నమోదు చేశారు. ఈ పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే చంద్రబాబుకు ఏసీబీ న్యాయస్థానం విధించిన 12 రోజుల రిమాండ్ శుక్రవారంతో ముగియనుంది. ఇలాంటి సమయంలో గురువారం ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పు పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.