
Accident in flyover : రాష్ర్ట రాజధాని హైదరాబాద్ లోని ఎల్‌బీనగర్ సాగర్ రింగ్‌రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున బైరామల్‌గూడ ఫ్లైఓవర్ స్లాబ్ కూలింది. ర్యాంప్ పనులు జరుగుతుండగా చోటు చేసుకన్న ఈ ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలు కాగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్ కుమార్ (25), పునీత్ కుమార్ (25), శంకర్ లాల్ (25), రవికుమార్ (26), జితేందర్ కుమార్ (26), హరేరామ్ (22), విక్కీ కుమార్ (23)లుగా గుర్తించారు. గాయపడిన వారిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంజనీర్ గోపాలకృష్ణ 29 కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎన్‌డీఆర్‌ఎఫ్ వాహనాల్లో చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైఓవర్ కింద ప్రయాణికులు పెద్దగా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ట్వీట్ చేస్తూ.. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ర్యాంప్ నిర్మాణంలో చిన్నపాటి భాగం కుప్పకూలింది. 8 మంది గాయపడి చికిత్స నిమిత్తం కిమ్స్‌కు తరలించారు. వివరణాత్మక విచారణ చేపడుతామని, ఘటనకు బాధ్యులపై చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉంది, జాగ్రత్తలు తీసుకుంటున్నందున ఆందోళన చెందవద్దని జీహెచ్ఎంసీ నగర వాసులకు హామీ ఇచ్చింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంజినీర్ల బృందం విచారణ చేసే అవకాశం ఉంది. క్షతగాత్రులను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. కాంట్రక్టర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం నైరుతి ఢిల్లీలోని రాజోక్రిలో NH-48 సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ – ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత భాగం – రెండు స్తంభాల మధ్య కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు షకీల్ మృతి చెందాడు. ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం మెకానికల్ వైఫల్యం కాణంగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.






