17.1 C
India
Tuesday, January 21, 2025
More

    Burra Subrahmanya Shastry : నటనాగ్రేసరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి  జయంతి నేడు..

    Date:

    Burra Subrahmanya Shastry
    Burra Subrahmanya Shastry

    Burra Subrahmanya Shastry : నాటకరంగ కళాకారుడు, స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకున్న నటనాగ్రేసరుడు, బహు ముఖ ప్రజ్ఞాశాలి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి  జయంతి సందర్భంగా ఆయన చేసిన నటనను ఒక్కసారిగా నెమరు వేసుకుందాం..

    స్త్రీ పాత్రల పోషణలో సాటి రాలేదాయనకు ఏ స్త్రీ రాబోదు అన్నట్లుగా ఆయన నాటక ప్రదర్శన ఉండేది. ఒక రోజు “చింతామణి” నాటక ప్రదర్శన జరుగు తోంది. రంగస్థల వేదికపై చింతామణి ప్రవేశం.ఒకటే ఈలలు, చప్పట్లు……. చింతామణి అందాల రాశి,సకల విద్యలు నేర్చిన నెరజాణ, సంగీత,సాహిత్యాల్లో నిష్ణాతురాలు. నాట్య మయూరి.చింతామణి రంగస్థలం పైకొచ్చి తన వగలు,వలపులు‌ వర్షిస్తోంది.

    ప్రపంచంలోని అందాన్నంతా చింతామణి లోనే కుప్పగా పోసినట్లుంది ముద్దు ముద్దు మాటలతో కళ్ళెదుట చింతామణి నయగారాలు పోతుంటే, ఎంత వారలైనా తమాయించుకోవడం కష్టమేమరి. నాటకం రక్తి లో వుంది. బిల్వమంగళుడ్ని లోబరు చుకునే సన్నివేశం అది.”నాకు ఎన్నో యేండ్ల నుండి “కామశాస్త్రం”నేర్చుకోవాలని వుంది.మీరు కామశా స్త్రంలో నిష్ణాతులట గదా!నాకు నేర్పుతారా?” అంటూ చింతామణి బిల్వ మంగళుడి ఒళ్ళో తూలి నట్లు పడి పోతుంది.

    ఇంతలో ప్రేక్షకుల్లోనుంచి ఓ ఆగంతకుడు గబగబా వేదికపైకెళ్ళి బిల్వ మంగళుడ్ని పక్కకు తోసేసి, చింతామణిని అమాంతంగా కౌగిలించుకొని,ముద్దులు కురిపించడం మొదలు పెట్టాడు.అనుకోని ఈ హఠాత్పరిణామానికి అటు  ప్రేక్షకులు,ఇటు నిర్వాహకులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.ఆ తర్వాత కొందరు వేదిక పైకెళ్ళి ఆగంతకుడి భరతంపట్టారు అది వేరేసంగతి.ఇంతకూ.. చింతామణి పాత్రధా (రుడు)రి ఎవరో తెలుసా? ఆయనే..బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి..

    అందచందాల్లో…

    వలపు, వయ్యారాల్లో ఆడాళ్ళకే అసూయ పుట్టించగలిగిన సాటిలేని మేటి నటుడు. నాట్య మయూర శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (Burra Subrahmanya Shastry) ఇదేదో తమాషాకు చెబుతున్న విషయం కాదు.. మంగళగి రిలో చింతామణి నాటక ప్రదర్శన సందర్భంగా జరిగిన ఓ ఆకతాయి వలన జరిగిన నిజ సంఘ టన…!! ఇలాంటి ఉదంతాలు  ఇదొక్కటే కాదం డోయ్ చాలానే వున్నాయి… ఆయనే బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి..

    1971 మద్రాసు త్యాగరాయ నగర్ లో వున్న వాణీ మహల్లో చింతామణి టికెట్  నాటకం ఏర్పాటు చేశారు. కొంగరజగ్గయ్య గారంటే శాస్త్రి గారికి ఎంతో అభిమానం.ఆహ్వానం తీసుకుని  సతీసమేతంగా జగ్గయ్య గారింటికెళ్ళారు. హాల్లో కూర్చున్న దంపతులు జగ్గయ్య గారు రాగానే లేచినిలబడి నమస్కారం చేశారు.

    క్లుప్తంగా నాటకం విషయంచెబితే  అనీజీగా ఫీల్ అయ్యారు.నాకు నాటకాలంటే అంత  ఆసక్తి లేదు.పైగా ఆరోజు పనికూడా వుంది.

    రాలేనన్నారు.శాస్త్రిగారికి బాధేసింది. నాటకాల నుంచి వచ్చిన జగ్గయ్య నాటకాల పై ఆసక్తి లేదనడం బాధించింది. లోపలికెళుతూ…అయినా ఆరోజు నాకు అటువైపు పనుంది.వీలైతే వచ్చి .. కాస్సేపుండి పోతానన్నారు జగ్గయ్య. అన్నట్టే వచ్చారు.స్టేజిమీద తెల్లని రవిక,చీరతో విరబోసుకున్న కురుల్ని సవరించుకుంటూ.

    ఒడిలో వీణను మీటుతా వయ్యారంగా చింతామ ణి రూపంలో సాక్షాత్కరించిన శాస్త్రిగారిని చూస్తూ జగ్గయ్య ఒక అద్భుతాన్ని చూసినంతగా మురిసి పోయారు.నాటకం మొదలైన దగ్గర్నుంచి, నాటకం అయిపోయేదాకా అలాగే కూర్చుండిపోయాడు జగ్గయ్య. అనంతరం గ్రీన్ రూంలోకెళ్ళి శాస్త్రి గారిని అమాంతంగా కౌగిలించుకొని క్షమాపణలడిగారు.

    ఇంటికి పిలిచి భోజనంపెట్టి,సన్మానం చేశారు.ఓ ఖరీదైన  వెండి వీణను కూడా బహూకరించారు.

    “నాటకం నుంచి వచ్చిన వాణ్ణి,తల్లిలాంటి నాటకాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు సిగ్గు పడుతున్నాను. మీరు సాక్షాత్తు నటరాజ మూర్తి.మాలాంటి సాధారణ నటులకు సాధ్యం కాని నటనా కౌశలం మీది” అంటూశాస్త్రి గారిని ప్రశంసించారు జగ్గయ్య.తిరుగు ప్రయాణంలో శాస్త్రి గారు రైల్లో ఆ వెండి వీణను మర్చిపోయారు. వీణపోయినందుకు చాలా బాధపడ్డారు.అయితే వీణ లేకున్నా,నాటి మధుర జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకున్నారు.

    ఏ ముగ్ధమనోహర స్త్రీ మూర్తి దేవాలయ సన్నివేశ మందు… పళ్ళెంపై పాదాల నుంచి,రెండు చేతుల్లో నూ వెలిగించిన దీపాలని పెట్టుకొని, శిరసు పై నీరు నింపిన ఒక పాత్ర పెట్టుకుని, #చింతామణి పాత్రలో నాట్యం చేసే “తరంగం” కూచిపూడి #నాట్యానికి, నటనకు, అచ్చెరువంది మంత్రముగ్దులై, “నాట్యా చార్య”అని బిరుదు  కవిసామ్రాట్ విశ్వనాథ వారు ఇచ్చి గౌరవించారో…ఎవరి హొయలు…. నాట్యం నడక స్త్రీ పాత్రలో చూచి కొండవీటి వెంకటకవి గారు నాట్యమయూరి బిరుదుతో ..సువర్ణ హస్త కంక ణంతో సన్మానించారో….ఎవరి  అభినయాన్ని చూడడానికి ఆంధ్ర  సినీనటులు,అధికారులూ సైతమూ ఉవిళ్లూరే వారో….అట్టి మహా నటుడు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.మెరిసే వర్చస్సు ముదిమి చేరిన తరగని సొగసు,స్త్రీత్వంలోని సొబగుతో కూడిన నటనా తపస్సు బుర్రా వారికి మాత్రమే లభించిన దేవుడి ఆశీస్సు.

    బాల్యం- తొలి జీవితం:

    1937వ సంవత్సరంలో ఫిబ్రవరి 9  న గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో జన్మించారు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి. బాగా పసితనంలోనే కమ్మగా పాటలు పాడటం, విన్న పద్యాలను శ్రావ్యంగా కంఠస్థం చేసి ఆలపించడం ఆయనకి జన్మతః భగవంతుడిచ్చిన వరాలు.ఆయన పాటలు, పద్యాలు విని మంత్రముగ్ధుడైన మేనమామ కోటేశ్వర్రావు వానపాముల సత్య నారాయణ అనే గురువు దగ్గర జేర్పించారు.

    సర్వకళల సమన్వితుడు సుబ్రహ్మణ్యశాస్త్రి గారుఆయన చేతివేళ్ళళ్లోకి కుంచె చేరిదంటే అద్భుతమైన చిత్రాలు ఆవిష్కరింప బడతాయి. ఆచేతులు కాళ్ళు చక్కటి నాట్యాన్ని అభినయించి చారెడుకళ్ళ హావ భావాలతో సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసాయి.

    ఉద్యోగం:

    పదో తరగతిలో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కి గోల్డ్ మెడల్ వచ్చింది 1956 ప్రాంతంలో చల్లపల్లి స్కూల్లో టీచర్ గా చేరారు.అప్పడు ఆయన జీతం 63 రూపాయలు.అలా ఉద్యోగం చేస్తూనే నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు. నాటకం ప్రదర్శనలు కోసం తరుచూ గుంటూరుకు రావడం జరిగేది.ఇలా  రాకపోకలు దేనికని చివరకు గుంటూరులోనే స్థిర పడ్డారు.చల్లపల్లిలోని టీచర్ వుద్యోగం వదిలేసి, 1958లో గుంటూరు లో 100 రూపాయలకు డ్యాన్స్ మేస్టారిగా చేరారు.

    నాటకరంగ ప్రవేశం:

    1953లో ఖిల్జీరాజ్య పతనంలో దేవళ అనే స్త్రీపాత్రని యాదృచ్ఛికంగా పోషించారు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆపాత్ర ఆయనకి దిశానిర్దేశం చేసింది. ఆయన హావభావాలు, వాచకం అందరినీ అలరించాయి.

    స్త్రీ పాత్రలు కొన్ని సుబ్రహ్మణ్యశాస్త్రి స్వంతాలు:

    సతీ సక్కుబాయి, మధురవాణి రెండూ విభిన్న మైన పాత్రలు.వాటి రెండింటికీ సమానంగా న్యాయం చేసి,ఔరా అనిపించారాయన. శశిరేఖ,సత్యభాల పాత్రలలో పరకాయ ప్రవేశం చేసారు.యోగి, వేమనలో మాధురిగా మఅలరించారు.ప్రజా నాయకుడు ప్రకాశంలో ప్రకాశం తల్లిగా ఆయన నటన అందరికీ అన్ని వేళలా గుర్తుంటుంది. వెనకటి వితంతువులు తెల్లిటి చీర, బోడిగుండు, బోసి చేతులు,మెడ, జాకెట్టు వేసుకోకున్నా నిండుగా చీరకప్పుకుని

    తలవంచి పరపురుషులతో కరుణరసాత్మకంగా మాట్లాడేవిధానం. ఒంటిచేత్తో పూటకూళ్ళలో పిల్లాడిని చదివించాలని ఆమె పడిన తాపత్రయం ఆయన నటనకి నాణ్యతని అందించాయి.

    శాస్త్రి స్త్రీ పాత్రలన్నింటి లోను ఒక నూతనత్వం గోచరిస్తుంది. కవి సృష్టించిన పాత్రకు న్యాయము చేస్తూ, మరొకవైపు సృజనాత్మక రూపం పాత్రకు ఆపాదింపచేసి సజీవ శిల్పంతో రాణింపు

    కలగచేస్తాడు. భావయుక్తమైన సంభాషణ విధానమూ,ఆ విధానానికి తగిన సాత్విక చలనమూ, ఆ చలనముతో సమ్మిళిత మైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ,సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, శృంగార రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరయ్యే టట్లు నటించేవాడు.చూపు మన్మధ బాణంలా ఉండేది. ప్రేక్షకుల కరతాళధ్వనితో నిండిపోయేది.

    ఈయన పాత్రలో ఆహార్య, వ్యవహారాల్లో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు. పురాణాల్లోని స్త్రీ పాత్రలను క్షుణ్ణంగా అథ్యయనం చేసి,వాటి  స్వభావానికి అనుగుణంగా కాస్ట్యూమ్స్ ధరించేవారు.ఇక సాత్వికా భినయానికి ఆయన పెట్టింది పేరు.తన సహనటులతో ఆయన టైమింగ్ గొప్పగా వుండేది. బుర్రా వారి కాంబినేషన్లో నటించేటపుడు  సహనటులు ఒళ్ళు దగ్గరబెట్టు కుని నటించేవారట. అకుంఠిత కార్యదీక్షతో ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి మొదలైన పాత్రలు ధరించి ఆంధ్ర దేశ ముఖ్య పట్టణాలలో స్త్రీ పాత్ర ధారణలో “ఔరా” అనిపించుకున్నాడు.

    చింతామణి లో…

    చింతామణి..బుర్రాకు (Burra Subrahmanya Shastry) మంచి పేరు తెచ్చిపెట్టాయి. మూడు తరాల నటులతో నటించిన ఏకైక రంగస్థ లనటుడు బుర్రా.. పద్యం పాడటం అభినయం అంతా ప్రత్యేకం, అంతెందుకు..స్త్రీ పాత్రకు ఆయనే స్వయంగా మేకప్ వేసుకునేవారు.చీరకట్టునుండి నుదుట తిలకం దిద్దుకునే వరకు అంతా ఆయన అభిరుచే కనబడేది.గాత్రం కూడా మెత్తగా,వుండటం తో స్త్రీ పాత్రలకు సరిగ్గా అతికేది.ఆయన రంగస్థలం పై పాట పాడినా,పద్యాన్ని ఆలపించినా ఎంతో మాధుర్యంగా వుండేది. ఆయన వాచికంలో నవరసాలూ పండేవి.ఇక ఆంగికాభినయాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన దేహ‌భాష స్త్రీ పాత్రకు పర్యాయపదంగా వుండేది. కళ్ళతో కూడా ఆయన భావాల్ని పలికించగ లరు.అందుకే.. బుర్రా వారి స్త్రీ పాత్రల్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కావు.

    నిరాడంబరుడు, నిగర్వి:

    అందరినీ గౌరవించడం, అభిమానంగా మసలుకోవడం సుబ్రహ్మణ్యంగారికి మొదటినుండి అలవాటు. సంప్రదాయ కుటుంబంలో పుట్టడం, కన్నవారి నుండి సంస్కారాన్ని నేర్చుకోవడం జరిగింది. హిందుత్వ పరిరక్షణ, భారతీయ తత్వాన్ని ప్రబోధించడం ఆయన కొన్ని సంవత్స రాలుగా చేసారు.

    ఆధ్యాత్మికవేత్తగా బుర్రావారు:

    రామాయణ, భారత, భాగవతాలు, వేదాలు, ఇతిహాసాలు, పంచతంత్ర అంశాలు ఏవైనా వారికి కంఠోపాఠాలు. ఆధ్యాత్మిక .ప్రసంగాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా అందరికీ చెప్పడం ఆయనకి అలవాటు.దేవీ భాగవతం, హనుమత్‌ చరిత్ర ప్రవచాలను చెప్పేవారు. కవిగా వాల్మీకి రామాయణాన్ని తనదైన పంథాలో రాసిన ఘనత ఈయన సొంతం.అష్టావిధ శృంగార నాయిక లు’అనే కావ్యంతో ఆయన అందరినీ ఆకట్టుకున్నా రు. వేమన చరిత్ర, ప్రణవక్షేత్రం లాంటి ప్రసిద్ధ నాటకాల్లో నటించారు. ఈయన స్వయంగా రాసిన ‘త్యాగయ్య’అనే నాటకం వేదిక ఎక్కకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

    *బహుముఖ ప్రజ్ఞాశాలి:*

    బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారకి  వివిధ కళలలో చక్కటి ప్రవేశం వుంది కూచిపూడి నృత్యం. చిత్రలేఖనం,హరికథ, శాస్త్రీయ సంగీతం, ఆథ్యాత్మికత,సంస్కృతం,ఛందస్సులో పరిజ్ఞానం,విగ్గుల తయారీ. టైలరింగ్ తదితర ‌అంశాల్లోఆయన ఆరితేరారు.

    *సినిమా,టివి సీరియల్స్…

    స్వయం కృషి, శ్రీ సత్యనారాయణ స్వామి వంటి సినిమాల్లో నటించారు.అలాగే రుద్రపీఠం, విక్రమార్క, సిద్ధేంద్రయోగి,గురునారాయణ చరిత్ర..తదితర సీరియల్స్ లో నటించారు.

    *నాటక దర్శకుడిగా…

    అనేక నాటకాలకు దర్శకత్వం వహించారు బుర్రా వారు.చండీ ప్రియ, సమ్మక్క సారక్క సక్కు బాయి.అభిజ్ఞానశాకుంతలం,అనార్కలి,చింతామణి విశ్వదాభి రామ,సత్య హరిశ్చంద్రీయం తారాశశాంకం,శ్రీకృష్ణ తులాభారం వంటి నాట కాలకు ఆయన దర్శకత్వం వహించారు. కృష్ణ తులాభారం,తారా శశాంకానికి ఉత్తమ దర్శకుడిగా బహుమతులు పొందారు.

    పురస్కారాలు:

    తెలుగువిశ్వవిద్యాలయం ఉత్తమనటుడు అవార్డు నిచ్చింది.రాష్ట్రస్థాయి అగ్రశేణి నటుడి అవార్డు సుబ్రహ్మణ్యశాస్త్రిని వరించింది. కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ నాట్యాచార్య బిరు దునీ, కొండవీటి వెంకటకవిచే నాట్యమయూరి బిరుదుని పొందారు.

    14 పర్యాయాలు సిఫార్సు చేసినా..

    భరతముని నాట్య శాస్త్రాన్ని రంగస్థలంపై అనుసరించిన మహానటుడు బుర్రా సుబ్ర హ్మణ్యశాస్త్రిగారికి రాష్ట్ర ప్రభుత్వం 14 పర్యాయాలు సిఫార్సు చేసినా, కేంద్రం పద్మశ్రీ అవార్డు ఇవ్వలేక పోయిందని సినీనటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి అంటారు.

    మహిళలు కూడా గుర్తుపట్టలేనంతా..

    రంగ స్థలంపై స్త్రీ పాత్రలో సహజంగా నటించిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అతని భార్యే గుర్తుపట్ట లేకపోయారని దీనికి మించిన అవార్డు మరొకటి లేదని అంటారు. స్త్రీ పాత్రలు వేయడంలో సుబ్రహ్మణ్య శాస్త్రి సిద్ధహస్తులని.. మహిళలు కూడా గుర్తుపట్టలేనంతా చక్కగా ఆయన తయారయ్యేవారు.

    సుబ్రహ్మణ్యశాస్త్రి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటించడం, రాయడం చిత్రాలు గీయడం నాట్యంలో ప్రావీణ్యత ప్రదర్శించడంలో తనకి తానేసాటిగా ఉన్న బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి గారు కారణజన్ముడు, అనుసరణీయుడు, ఆరాధ్య నీయుడు. 2019, ఏప్రిల్ 7న హైదరా బాదులో మరణించాడు.ఈయన కుమారుడైన సాయి మాధవ్‌ బుర్రా తెలుగు సినీరంగంలో రచయితగా పని చేస్తున్నాడు.కృష్ణం వందే జగద్గురుం సినిమాతో సినీ సంభాషణల రచయితగా పరిచయమయ్యాడు.

    బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి గారు గొప్ప నటులే కాదు, పండితులు కూడా.ఎన్నో విషయాల్లో సందేహం కలిగినపుడు పరిష్కరించేవారు.వారు సాంప్రదా య కళాకారులు అయినా,ఆధునిక నాటక విద్యా ర్థులకు పాఠాలు చెప్పేవారు. వారు నాటకరంగ సర్వస్వం రంగస్థల విజ్ఞానo.

    Share post:

    More like this
    Related

    Indian Travelers : భారత ప్రయాణికులు యూకే ద్వారా వెళుతున్నారా? అయితే మీకు షాక్

    Indian travelers : అమెరికా, కెనడా సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి వచ్చే...

    Trump : 84 శాతం మంది భారతీయులు ట్రంప్ రాకను స్వాగతిస్తున్నారట

    Trump : యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ECFR) నిర్వహించిన గ్లోబల్...

    Sankranti Celebrations : బ్రిటన్ లో అంబరాన్నంటిన తెలుగువారి సంక్రాంతి సంబరాలు

    Sankranti Celebrations : తేటతెలుగువారి ఘన పండుగ సంక్రాంతి. ఆంధ్రాలోనైనా అమెరికాలోనైనా ఈ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related