
Bandar Port : ఏపీలో బందర్ పోర్టు పనులకు ఏపీ సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. మచిలిపట్నం ప్రజల కలగా బందర్ పోర్టును చెబుతారు. అయితే ఈ పోర్టు ఇప్పట్లో పూర్తవుతుందా.. మళ్లీ పాత కథేనా అని ప్రజల్లో చర్చ జోరుగా సాగుతున్నది..
ఇంతకీ పాత కథ ఏంటని అనుకుంటున్నారా… అయితే చదివేయండి.. బందర్ పోర్టు పనులను ప్రారంభించడం ఇది కొత్తేమి కాదు. ముఖ్యమంత్రులు దీనిని ప్రారంభించడం ఇది మూడో సారి. మొదటి సారిగా 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరగ్రహరంలో శిలాఫలకం ఆవిష్కరించి బందర్ పోర్టు పనులను ప్రారంభించారు. కాని పనులు ముందుకు సాగలేదు. ఆ 2013లో బందర్ లో ఒక సభలో పాల్గొన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బందర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కాని దానిని పట్టించుకోలేదు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ పేర్నినాని ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా కొబ్బరికాయ కొట్టారు. తన పార్టీ ఎంపీకి చెందిన నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ సమయంలో ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆ తర్వాత ఏపీ లో వైసీపీ అధికారంలోకి రావడం జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. పనులు జాప్యం చేస్తున్నారనే కారణం చూపి నవయుగ కాంట్రాక్ట్ ను సీఎం జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక పనులు ఆగిపోయాయి. తాజాగా జగన్ మరోసారి ఎన్నికలకు ఏడాది ముందు బందర్ పోర్టు పనులకు సోమవారం మరోసారి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పేర్ని నాని ఉన్నారు.