AP CM Jagan :
విశాఖపట్నం నుంచి పాలన సాగించడానికి ముహూర్తం ఫిక్స్ అవుతోంది. దసరా తరువాత నుంచి ఏపీ సీఎం జగన్ క్యాంప్ వైజాగ్ కు మారనుంది. ఆ మేరకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఆయన అక్కడకు మకాం మార్చగానే మూడు రాజధానుల ముచ్చట తీరినట్టేనని వైసీపీ భావిస్తోంది. చట్ట ప్రకారం మాత్రం మూడు రాజధానులు అనే విధానం సాధ్యం కాదు. విభజన చట్టంలోనూ అలాగా ఎక్కడా పొందుపరచలేదు. అనుకూల రాజధాని ప్రాంతాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలని సూచించింది. అంతేగానీ, సీఎం క్యాంప్ ఆఫీస్ మార్చుకోవడానికి లేదని లేదు. అందుకే, జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళుతున్నారట.
దసరా తరువాత మూడు రోజుల పాటు వైజాగ్ ..
గత మూడేళ్లుగా మూడు రాజధానుల ముచ్చటను జగన్ వినిపిస్తున్నారు. అందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్నారు. కానీ మండలిలో రివర్స్ అయింది. ఆ తరువాత న్యాయస్థానం ఎంట్రీ కావడంతో ఆయన మనసు రివర్స్ అయింది. అనివార్యంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. చట్టబద్ధంగా ప్రస్తుతం ఒకటే రాజధాని, అదే అమరావతి. కానీ, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ పలుమార్లు చెప్పారు. ఏపీ రాజధాని ఏది? అంటే అమరావతి అంటూ చెప్పలేకపోతున్నారు. ఇంకా హైదరాబాద్ ఏపీ రాజధాని అంటూ మంత్రులు చెబుతున్నారు. కానీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికార వికేంద్రీకరణ అంటూ వైజాగ్ కు క్యాంపు ఆఫీస్ ను మార్చేస్తున్నారు. అందుకోసం రుషికొండను తొలిచేశారు.
మూడేళ్లుగా మూడు రాజధానుల ముచ్చట
దసరా తరువాత మూడు రోజుల పాటు వైజాగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కార్యకలాపాలు ఉండేలా అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో మిగిలిన రోజుల్లో మాత్రం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద ఆయన ఉండేలా షెడ్యూల్ చేస్తున్నారు. గతంలోనూ 2014 ఎన్నికల తరువాత చంద్రబాబు ఇలాగే ప్లాన్ చేశారు. మూడు రోజులు హైదరాబాద్, మూడు రోజులు విజయవాడ, ఒక రోజు ఢిల్లీ అనేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు ఏకంగా ఏపీ వరకు పరిమితం చేసేలా చేయడం అందరికీ తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను మార్చే టైమ్ కి ఎన్నికలకు రాబోతున్నాయి. పర్మినెంట్ గా ఎక్కడ ఉండాలో నిర్ణయించే ఎన్నికలకు అవి. అందుకే, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ మరోసారి అధికారాన్ని ఇస్తుందని ఆశపడుతున్నారు.
గత ఏడాది దసరా సందర్భంగా కూడా ఇలాగే ముహూర్తం పెట్టారు. కానీ, తాడేపల్లి నుంచి పరిపాలన సాగింది. కానీ, ఈసారి సీరియస్ అంటూ ఎంపీ సాయిరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి చెబుతున్నారు. సెప్టెంబర్లోనే షిఫ్టింగ్ అంటూ ఇటీవల ప్రకటించారు. ఆ మేరకు కొన్ని రోజుల్లోనే తాడేపల్లి ఖాళీ చేయాలి. కానీ, అలాంటి హడావుడి కనిపించడంలేదు. దసరా తరువాత మార్పు జరుగుతుందని మాత్రం చెబుతున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు. ఈనెల 12న ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. ఆ తరువాత విశాఖ షిప్టింగ్ వేగవంతం అవుతుందని వైసీపీ వర్గాల్లోని టాక్. వారానికి మూడు రోజులు విశాఖ, మిగిలిన రోజులు తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.
గత నాలుగేళ్ళుగా మూడు రాజధానులంటూ పాడి చివరికి విశాఖ ఒక్కటే రాజధాని అని తేల్చేశారు. కానీ అది కూడా ఏర్పాటు చేయలేకపోయారని టిడిపి, జనసేనలు ఎద్దేవా చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తప్పకుండా అమరావతి రాజధాని అంశం ఓటర్లను ప్రభావితం చేస్తుంది. కనుక ‘విశాఖ నుంచి పాలన’ పేరుతో ఎన్నికలయ్యే వరకు ప్రజలను మభ్య పెట్టగలిగితే వైసీపి ఒడ్డున పడుతుంది.
అమరావతి గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో తెలుగుదేశం లేదు. ఈ కారణంగా జగన్ విశాఖకు మకాం మార్చినా దాని గురించి కూడా టీడీపీ మాట్లాడలేకపోవచ్చు. కనుక ఎన్నికలలో ‘విశాఖ రాజధాని-దాని వలన కలిగే ప్రయోజనాలు’ గురించి వైసీపి ఎంచక్కా డబ్బా కొట్టుకోవచ్చు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరిగిపోయింది. అది ఓట్ల రూపంలో కురిస్తే వైసీపీకి నష్టం తప్పదు. కనుక ఆ సానుభూతిని తుడిచేయాలంటే రాష్ట్ర ప్రజల దృష్టిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ నుంచి మళ్ళించాలి. దానికి ‘విశాఖ రాజధాని’ డ్రామా సరిపోతుంది.
ReplyForward
|