
Telangana Congress : కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్ లో జోష్ ను నింపాయి. తెలంగాణలో కూడా ఈ ఫలితాలే సాధించాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. ఇందుకోసం భారీ స్కెచ్ ను సిద్ధంచేసుకున్నట్లు తెలుస్తు్న్నది. బీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయాలనే ఏకైక లక్ష్యంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈనెల 25న జడ్చర్లలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నారు ఇప్పటికే మంచిర్యాలలో ఒక సభను నిర్వహించారు. అయితే జడ్చర్ల సభకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ హాజరవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్ సభకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రియాంక గాంధీ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎన్నికలకు మరో ఐదు నెలలే గడువు ఉండడంతో, కాంగ్రెస్ వేగం పెంచింది. పార్టీలో చేరికలపై కూడా దృష్టిపెట్టింది. పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ ను వీడిన పొంగులేటి, జూపల్లి తదితర సీనియర్లనుపార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నది. మరోవైపు కాంగ్రెస్సే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని, బీజేపీ నేతలు ఈటల, కొండా తమతో రావాలని రేవంత్ కోరుతున్నారు. సీనియర్లతో కూడా తాను కలిసి పనిచేస్తానని, పార్టీ కోసం పది మెట్లు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన ఇటీవల ప్రకటించారు. మరోవైపు మరికొన్ని డిక్లరేషన్లు ప్రకటించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జడ్చర్ల సభ ద్వారా అతి త్వరలోనే సోనియా, రాహుల్ తో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీ కాంగ్రెస్ సిద్ధమవుతున్నది.