
AI in media : ఆర్టిఫిషియల్ ఇంటలీజెంట్ (AI)తో ఇప్పటికే చాలా నష్టం జరుగుతోంది. సొంతంగా ఆలోచించే రోబోల సృష్టితో మానవ జీవనం అతలాకుతలం అవుతుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా భయపడుతున్నారు. మానవ జీవితాలను పెనుమార్పులకు గురి చేస్తుంది. ఇది కనుక పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది రోడ్డున పడతారు. కొవిడ్ సృష్టించిన వినాశనం నుంచి కోలుకునేందుకు ఇప్పటికీ ప్రపంచం ఆగం ఆగం అవుతుంది, ఇక ఏఐ పూర్తి వినియోగంలోకి వచ్చిందా. తీవ్రమైన అలజడి రేగుతుంది.
ఇప్పటికే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ కోట్లాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరిపై ఆధారపడ్డ కుటుంబాలతో కలిసి కోట్లాది మంది రోడ్డున పడ్డారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఆధారిత సేవల స్థానంలో ఏఐ, చాట్ జీపీటీని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ అధునాతన సాంకేతికత అన్ని రంగాలను ప్రభావితం చేసేలా కనిపిస్తుంది. ప్రతీ రంగంలో దీన్ని ఉపయోగిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చనే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి.
రీసెంట్ గా ఈ టెక్నాలజీ మీడియా రంగంలోకి కూడా ప్రవేశించింది. దీని ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ‘ఆక్సెల్ స్ప్రింగర్’ తమ న్యూస్ రూమ్ నుంచి 20 శాతం సిబ్బందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీరి స్థానాలను ఏఐతో భర్తీ చేయాలని కూడా భావిస్తోందట. ప్రింట్ ప్రొడక్షన్ లో విధులు నిర్వర్తించే ఎడిటర్లు, ఫొటో ఎడిటర్స్, ప్రూఫ్ రీడర్స్, ఇతర ఉద్యోగులను సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. వారంతా సుమారు 200 మంది ఉద్యోగులు వరకు కానున్నారని సమాచారం.
అయితే ఆక్సెల్ స్ర్పింగర్ సంస్థలో 1000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రింట్ మీడియా నుంచి పూర్తిగా డిజిటల్ పబ్లిషర్ గా మారిపోవాలని మీడియా సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రింటింగ్ విభాగాల్లో ఉన్న వారిని మాత్రమే తొలగిస్తామని సంస్థ చెప్తోంది. జర్నలిస్ట్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే ఇందులో ఉద్యోగుల తొలగింపునకు, ఏఐ వినియోగానికి అస్సలు సంబంధం లేదని సంస్థ ప్రకటించడం కొసమెరుపు. ఏఐని సపోర్ట్ చేసుకొని పని చేస్తే మరింత ఫలాలు సాధ్యమవుతాయని అందుకే ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంస్థ చెప్పింది.