Pushkarini : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలకు వెళ్లే భక్తులు.. శ్రీవారిని దర్శించుకునే ముందు పుష్కరిణి (కోనేరు)లో స్నానాలు చేయడం ఆనవాయితీ. తలనీలాలు సమర్పించిన భక్తులతో పాటు మరికొందరు భక్తులు కూడా కోనేటిలో స్నానం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆగస్ట్ 1 నుంచి మీకు ఆ అదృష్టం దక్కకపోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్కరిణి ఆగష్టు 1 నుంచి 31 వరకు మూసివేయనున్నారు. ఈ మాసంలో శ్రీవారి భక్తులు కోనేటిలో స్నానమాచరించేందుకు అనుమతి లేదు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీవారి పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించడంతోపాటు పైపులైన్ మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు పుష్కరిణిని నెల రోజుల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నెల రోజులుగా పుష్కరిణి హారతి కార్యక్రమం ఉండదు. శ్రీవారి పుష్కరిణిలో నీరు నిల్వ చేయరు. ఈ నీటిని శుద్ధి చేసి పునర్వినియోగం చేసేందుకు రీసైక్లింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. నీరు నిరంతరం శుద్ధి చేయబడి ఉపయోగించబడుతుంది. కానీ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోనేటిని నెల రోజుల పాటు మూసివేసి మరమ్మతులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలి పదిరోజుల పాటు కోనేటి లోని నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత పది రోజుల పాటు మరమ్మతులు చేపడతారు. చివరి పదిరోజుల్లో నీరు నింపే కార్యక్రమం ఉంటుంది. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. ఈ పనులన్నీ టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం నిర్వహిస్తోంది.
తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం (జూలై 30) సాయంత్రం కుంకుమార్చన జరగనుంది. జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు సంప్రోక్షణ ఉత్సవాలు జరగనుండగా.. ఏటా మూడు రోజుల పాటు ఆలయంలో ముడుపుల ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.