
Indians luxury : భారతీయులు ఇప్పుడు విందులు, వినోదాలు, విహార యాత్రలకు ప్రాధాన్యతనిస్తున్నారు. కరోనా మహమ్మారి వేళ అందరూ ఇంటికే పరిమితమై.. ఇంటి నుంచే పనిచేస్తూ మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడ్డారు. మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యారు. అందుకే ఇప్పుడు కరోనా క్రమంగా అదుపులోకి రావడంతో లాక్‌డౌన్‌లు ఎత్తివేయడంతో అందరూ విహార యాత్రలు చేస్తూ.. లగ్జరీలు అనుభవిస్తూ ఖర్చు చేస్తున్నారు. కరోనా తర్వాత డబ్బులు పొదుపు చేయడం కంటే ఉన్నంతలో ఆనందంగా బతకాలని అందరిలోనూ మార్పు వచ్చింది. అందుకే వచ్చిన సంపదనను తమకే వినియోగిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఇందుకోసం భారతీయులు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు.
కరోనా తర్వాత భారతీయులు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఎక్కువగా ఖర్చు పెడుతున్న పరిస్థితి నెలకొంది. విశాలమైన నివాసాలు, విలాసవంతమైన భవనాలు, ఆభరణాలు, గడియారాలు, చక్కటి భోజనాలు మొదలైన వాటిపై విపరీతంగా ఖర్చు చేస్తున్నట్టు సర్వేలో తేలింది. అన్ని దేశాల వారి కంటే భారతీయుల ఖర్చు ట్రెండ్‌గా మారింది. ఎంతగా అంటే యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఈ మేరకు సర్వే చేసి మరీ నిజాలు బయటపెట్టింది.

విలాసవంతమైన వస్తువుల మార్కెట్ భారత్ తో జోరుగా ఉంది. ఇందులో వ్యక్తిగత లగ్జరీ, ఫైన్ వైన్‌లు/షాంపైన్ , స్పిరిట్స్, లగ్జరీ కార్లు , ఎక్స్‌పీరియన్షియల్ లగ్జరీ విభాగాల్లో భారతీయులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. మహమ్మారి కారణంగా ఏర్పడిన ఎదురుదెబ్బ తర్వాత ఈ రెండేళ్లలో రూ. 50,000 కోట్లకు పైగా ఈ లగ్జరీ మార్కెట్ భారత్ లో పుంజుకుంది. కరోనా తగ్గాక 2022లో దాదాపు రూ. 46,000 కోట్లతో ఇది ఊపందుకుంది.
దీనికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కరోనా తర్వాత జనాల మైండ్ సెట్ మారింది. కోట్లు పోగేసే కంటే ఉన్నప్పుడే అనుభవించాలన్న ధోరణి జనాల్లో పెరిగింది. అందుకే కొనుగోలు శక్తి భారతీయుల్లో విపరీతంగా పెరగడంతో స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి. యువ వ్యాపార యజమానులు దేశంలో వినూత్న వస్తువులు, వ్యాపారాలతో పుట్టుకొస్తున్నారు. వారి సంస్థల విలువలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో మధ్యతరగతి, సంపన్నులు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.
భారత్ లో అత్యధిక సంపదన కలిగిన అంటే భారతీయ అల్ట్రా హై నెట్-వర్త్ వ్యక్తుల (UHNIలు) సంఖ్య కూడా పెరిగింది. $30 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వారు పెరిగారు. నైట్ ఫ్రాంక్ అంచనాల ప్రకారం, భారతదేశ UHNI జనాభా 2020 మరియు 2021 మధ్య 11 శాతం పెరిగింది. 2021 మరియు 2026 మధ్య 39 శాతం వరకు పెరగడం గమనార్హం..
భారతీయులు ప్రధానంగా.. అత్యుత్తమ రెస్టారెంట్‌లు, అత్యుత్తమ విహారయాత్రలు, సినిమా వీక్షణ అనుభవాలు, లగ్జరీ ఆటో , రియల్ ఎస్టేట్‌లో తాజా ట్రెండ్‌లు, సంపన్నులు ప్రైవేట్ జెట్‌ల ద్వారా ప్రయాణించడాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. విలాసవంతమైన విషయాలకే భారతీయులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఖర్చు చేస్తున్నారు..
భారతీయ లగ్జరీ మార్కెట్ ముందుకు దూసుకుపోతున్నందున, ప్రపంచ దిగ్గజాలు కూడా ఈ లాభదాయకమైన వ్యాపారాన్ని అందిపుచ్చుకోవడానికి పెద్ద ఎత్తున భారత్ లో పెట్టుబడులకు ప్లాన్ చేస్తున్నాయి. స్టోరీడ్ ఇటాలియన్ జ్యువెలరీ దిగ్గజం Bvlgari ఇప్పుడు LVMH గ్రూప్‌లో భాగం కానుంది కంపెనీ భారతదేశంలో తన ఆభరణాల దుకాణాల సంఖ్యను పెంచే ప్రక్రియలో ఉంది.
ప్రపంచ దేశాల్లోని, దేశంలోని అతిపెద్ద FMCG కంపెనీలు ఇప్పుడు భారతీయ మార్కెట్‌లలోకి చొచ్చుకుపోవడానికి.. సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. భారతీయుల కొనుగోలు శక్తి లగ్జరీలు పెరగడంతో ప్రపంచ కంపెనీలు భారత బాటపడుతున్నాయి. యాపిల్ సంస్థ కూడా చైనాను కాదని భారత్ లో పెట్టుబడులకు మొగ్గు చూపుతోంది.
ఇదంతా కూడా భారత ఎకానమీ జోరుకు నిదర్శనాలు. కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాలతో భారతీయ ఆర్థిక వ్యవస్థ జోరు అందుకుంది. ప్రజల ఆదాయం పెరిగింది. పేదరికం ఏకంగా మోడీ హయాంలో 13శాతం తగ్గింది. కనిష్ట స్థాయికి దిగజారింది. దీంతో భారతీయులు కరోనా తర్వాత ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. కార్లు, బంగాళాలు, విదేశీయాత్రలు, ఇతర లగ్జరీ వస్తువులు కొంటూ భారతీయ మార్కెట్ లో జోరును పెంచుతున్నారు. తద్వారా భారతీయ ఆర్తిక రంగాన్ని పరుగులు పెడుతున్నారు. విదేశీ ప్రఖ్యాత కంపెనీలు భారత్ కు క్యూకట్టడానికి ఇప్పుడు ఇదే కారణం.






