Allagadda Constituency Review :
వైసీపీ : గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి (ప్రస్తుత ఎమ్మెల్యే)
టీడీపీ : భూమా అఖిలప్రియ
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గానికి రాష్ర్ట రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గతంలో భూమా కుటుంబం హవా కొనసాగేది. భూమా దంపతుల మృతి తర్వాత వారి పెద్ద బిడ్డ అఖిలప్రియ ఇక్కడి రాజకీయాలను చూసుకుంటున్నారు. 2014లో ఇక్కడి నుంచి భూమా శోభానాగిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆమె మృతి చెందారు. ఇక అఖిలప్రియ రంగంలోకి దిగారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి పై 35613 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
ఆళ్లగడ్డలో గంగుల కుటుంబానిది కూడా అదే స్థాయిలో రాజకీయ ప్రాబల్యం ఉంది. అయితే 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి , మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రజల్లోనే ఉంటూ రాజకీయాలు కొనసాగిస్తున్నారు. అటు నంద్యాల నియోజకవర్గంలోనూ ఆమె తన ప్రాబల్యం కాపాడుకుంటున్నారు. అయితే ఆళ్లగడ్డలో ఆమెకు బంధుగణం, భూమా కుటుంబానికి అనుచరగణం పెద్ద ఎత్తున ఉంది. అయితే భూమా అఖిలప్రియ రెండో వివాహం తర్వాత కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగా ఆమెకు బంధువులు దూరమైనట్లు టాక్ నడుస్తున్నది. ఇటు సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి తో కూడా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే వారందరినీ బుజ్జగించే పనిలో పడ్డారు.
అయితే ఇక్కడ భూమా, గంగుల కుటుంబాల మధ్యే అధిపత్యం ఉంటుంది. గతంలో కూడా గంగుల కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు ఉన్నారు. అయితే 2024 ఎన్నికలు ఈ రెండు కుటుంబాలకు పెద్ద పరీక్షే. అధికార పార్టీలో ఉండడం గంగుల బిజేంద్రనాథ్ రెడ్డికి అడ్వాంటేజ్ కాగా, ఇక అఖిలప్రియ చుట్టూ ఉన్న వివాదాలు ఆమెకు అవరోధంగా మారే చాన్స్ ఉంది. అయితే వాటన్నింటి నుంచి బయటపడేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు భూమానాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి ఆశయాలను నెరవేర్చడమే తన ధ్యేయమని, ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు తనకు కావాలని కోరుతున్నారు. బంధుగణాన్ని మరోసారి తనవైపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తమ్ముడు విఖ్యాత్ రెడ్డి కూడా అక్క అఖిలప్రియతో కలిసే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ తప్పదనే అభిప్రాయం వినిపిస్తున్నది.