
Niharika : గత కొన్ని రోజుల నుంచి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే వారు విడిపోయారంటూ అనేక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీకి అస్సలే పడటం లేదంటూ టాలీవుడ్‌లో గుస గుసలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నాగబాబు పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. దాన్ని గుర్తుచేస్తూ ‘జనసేన అఖండ విజయం సాధించింది. కానీ, అందరూ ఒకే తాటిపై లేకపోవడంతో మీ ఫ్యామిలీ నిరుత్సాహపడిందా?’ అని యాంకర్ అడగ్గా నిహారిక స్పందించారు. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
‘నాగబాబు హర్ట్ అయి, ఆ పోస్ట్‌లు చేశారని అప్పుడు వార్తలొచ్చాయి కదా’ అని నిహారికను ప్రశ్నించగా.. ‘‘మా నాన్న ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన వేరే దేని గురించో పోస్ట్ పెట్టుంటారు. దానికి కారణమేంటో నాకు తెలియదు. నాన్న ఎక్స్‌లోనే కాదు వాట్సాప్‌లోనూ ప్రతిరోజూ సూక్తి పెడుతుంటారు. ఇంట్లో ఆ టాపిక్కే రాలేదు’’ అని తెలిపారు.
వాస్తవానికి అల్లు అర్జున్ తన మామయ్య పవన్ కళ్యాణ్‌ను కాదు అని, వైసీపీ నేతకు సపోర్ట్ చేయడంతో రెండు కుటుంబాల మధ్య అగ్గి రాజుకుంది. దీంతో దీనిపై నాగబాబు మండిపడుతూ.. వాడు మనవాడే కానీ పరాయోడు అంటూ ట్వీట్ చేశారు. కొందరు ఇది అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అన్నారంటూ అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ పై మండిపడటం, ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధమే జరిగింది అని చెప్పాలి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్‌కు అల్లు ఫ్యామిలీ రాకపోవడం, ప్రమాణ స్వీకారం లో కూడా వారు కనిపించకపోవడంతో వీరి మధ్య విభేదాలపై వస్తున్న వార్తలు నిజమే అంటూ కొందరు తేల్చేశారు. కాగా, దీనిపై నిహారిక మాట్లాడుతూ..వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అల్లు అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తారో అది ఆయన వ్యక్తిగత విషయం. దానిపై మెగా ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి వ్యతిరేకత లేదు.. అన్నట్లు ఆమె పరోక్షంగా కామెంట్స్ చేసింది.






