
Pawan Kalyan :
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నది. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం ఎదుర్కొన్న తర్వాత 2024 లో ఎలాగైనా తమ సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ వ్యక్తిగత దూషణలకు దిగుతూ తనను బెదిరిస్తున్నా, ఎక్కడా ఆదరకుండా ఆయన ముందుకెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని దెబ్బతీయాలనే లక్ష్యంతో ఆయన పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో టీడీపీతో కలిసి ముందుకు సాగాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టారు. గోదావరి జిల్లాల్లో రెండు విడుతల యాత్ర పూర్తి చేశారు. ఏపీ సీఎం జగన్ టార్గెట్ ఆయన ఎదురు దాడి చేస్తున్నారు. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయం జనసేన మాత్రమేననే అభిప్రాయం ప్రజల్లో వచ్చేలా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ పాలనను ప్రజలంతా చూశారు. ప్రస్తుతం జనసేనాని టీడీపీ పై విమర్శలు చేయకున్నా అధికార వైసీపీని తన మాటలతో ఆడుకుంటున్నారు. వలంటీర్ల అంశాన్ని వివాదాస్పదం చేసి, వైసీపీకి వణుకు పుట్టించారు. ఆ పార్టీ తెచ్చిన ఆ వ్యవస్థపైనే అనుమానాలు పుట్టించారు. చాలా చోట్ల వలంటీర్లంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీని చూస్తున్న క్రమంలో ఇప్పుడు జనసేన లైన్ లోకి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కారణంగా అన్యాయం జరిగిన వారిని కలుస్తూ తాము అండగా ఉంటామని జనసేనాని చెబుతున్నారు.
అయితే తాజాగా కృష్ణ జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో జనసేన అధినేత పర్యటించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం ఇక్కడ రైతుల భూములను తీసుకుంది. 1460 ఎకరాలను పారిశ్రామిక వాడకు ఇచ్చింది. అయితే రైతులకు సరైన నష్టపరిహారం అందలేదు. ప్రభుత్వం మారడం, వైసీపీ సర్కారు పట్టించుకోకపోవడంతో మల్లవల్లి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారితో పవన్ మాట్లాడారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లవల్లి రైతుల సమస్యలు తానే పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. వైసీపీ పాలనను ఎండగట్టారు. రానున్న రోజుల్లో జనసేనను ఆదరించాలని, ప్రత్యామ్నాయంగా తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే పవన్ టీడీపీతో కలిసినా రైతుల నష్టపరిహారం విషయంలో ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని అడుగుతారని చాలా మంది అభిప్రాయపడ్డారు. పవన్ ముక్కుసూటి వ్యక్తి అని, హామీ ఇచ్చాక నెరవేరుస్తాడని అంతా అనుకుంటున్నారు.