
Pregnant Women : బిడ్డకు జన్మనివ్వడం అంటే మామూలు విషయం కాదు. శిశువు కడుపులో పడినప్పటి నుంచి ఆడవారి శరీరంలో అనూహ్యమైన మార్పులు వస్తుంటాయి. వారి శరీరంతో పాలు మూడ్స్ కూడా మారిపోతుంటాయి. హార్మోన్స్ లో మార్పులు, ఇలా ప్రతీ ఒక్కటి మొదలై వారిని మరింత కుంగిపోయేలా చేస్తాయి. కుంగుబాటును ముందే కనిపెడితే చాలా ఇబ్బందులను తొలగించవచ్చు.
గర్భిణికి కాన్పు అయ్యేలోగా మానసిక కుంగుబాటు కలుగుతుందా? అన్నది తెలియదు. దీని కోసం శాస్త్రవేత్తలు ఒక యాప్ తీసుకువచ్చారు. దీని ద్వారా ఈ సమస్య ఉన్నవారిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టేందుకు వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అమెరికా పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
మూడు నెలల గర్భంతో ఉన్న మహిళలపై సర్వే చేసిన శాస్త్రవేత్తలు కుంగుబాటుకు సంబంధించిన కొన్ని అంశాలను గుర్తించారు. అందులో నిద్ర, ఆహారం వంటివి ఉన్నాయి. మొత్తం 944 మంది మహిళలపై ఒక అధ్యయనం నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ డేటా ఉపయోగించి, శాస్త్రవేత్తలు ఆరు మెషీన్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేశారు.
ఇందులో ఒకటి.. గర్భిణుల్లో తలెత్తే కుంగుబాటును 89 శాతం ఖచ్చితంగా అంచనా వేస్తుంది. మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్ అనేది ఒకరకమైన కృత్రిమ మేథ సాధనం. అది పాత డేటాను విశ్లేషించి, భవిష్యత్ అంచనాలను ఎలా వేయాలో చెప్తోంది. కుంగుబాటుకు దారితీసే ముప్పు అంశాలను సులువుగా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాన్పు గురించి ఆందోళన, ఆహార లభ్యత సమస్యలు ఇందులో ఉన్నాయని వివరించారు. ఈ యాప్ గర్భిణులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.