Andhrapradesh : ఏపీ సర్కార్ కొత్త మద్యం పాలసీని ఖరారు చేసింది. ఈ విధానం అక్టోబర్ 12 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్స్‌ల జారీకి సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి(మంగళవారం) నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11న లాటరీ నిర్వహిస్తారు. దరఖాస్తు లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లనైనా సమర్పించవచ్చు. ఒక్కోదానికి రూ.2 లక్షలు తిరిగి చెల్లించలేని మొత్తం చెల్లించాలి. దరఖాస్తు రుసుమును బ్యాంక్ చలాన్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత డీడీ తీసుకుని ఎక్సైజ్ స్టేషన్లలో సమర్పించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీలు తీసి లైసెన్స్‌లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 11న జరగనుంది. లైసెన్సులు 12వ తేదీన కొత్త మద్యం దుకాణాలను తెరవవచ్చు.
కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలు. 10,000 నుంచి 50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,001 నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో 65 లక్షలు. 5 లక్షల ఆదాయం దాటిన నగరాల్లో గరిష్ట రుసుము రూ.85 లక్షలుగా నిర్ణయించారు. లైసెన్స్‌దారులు ఈ రుసుములను ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. క్వార్టర్ మద్యాన్ని ఎమ్మార్పీ రూ.99కి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలతో పాటు అదనంగా 12 ప్రీమియం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రత్యేక విధానాలు ఉన్నాయి.