Sharmila : వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలపై మరో కేసు నమోదైంది. ఆమెపై వివిధ సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. చివరిగా లోటస్‌పాండ్‌లోని తన ఇంటి నుంచి బయటికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై చేయి చేసుకుంది. ఈ కారణంతో కేసు నమోదైంది. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ సర్కార్‌పై మీడియా సమావేశాల్లో, సోషల్ మీడియాలో దూషణలకు దిగడంతో కేసు నమోదైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై Sharmila ధూషణలకు దిగడంతో కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత నరేందర్ యాదవ్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై 505(2), 504 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అయితే షర్మిలను బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడిక్కడే కట్టడి చేస్తోంది. గతంలో షర్మిల పాదయాత్రలు నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వంపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడంతో ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది.
న్యాయ పోరాటం చేసి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నప్పటికీ అడుగులు ముందుకు వేయలేని పరిస్థితి ఆమెది. నోరు తెరిచినా.. అడుగేసినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వానికి టార్గెట్ కాదని తెలిసినా, ప్రజల్లో షర్మిల పార్టీకి తగిన ఆదరణ లేకున్నా కేసులు పెట్టి ఆమెను ఎందుకు హైలెట్ చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.