
Avinash : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో ఆయనను సీబీఐ కొన్ని రోజులుగా విచారిస్తున్నది. ప్రస్తుతం కేసు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ దూకుడు పెంచింది. వచ్చే నెలాఖరులోగా కేసును కొలిక్కి తేవాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.
రెండు సార్లు గైర్హాజరు..
ముందుగా ఈనెల 16న విచారణకు రావాలని సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి 11 గంటలకు రావాలని ఆదేశించింది. అయితే వ్యక్తిగత కారణాలతో నాలుగు రోజుల పాటు విచారణకు రావడం వీలు కాదని ఎంపీ అవినాష్ సీబీఐ కి లేఖ రాశారు. ఆ వెంటనే హైదరాబాద్ నుంచి కడప బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత శుక్రవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఈ విచారణకు కూడా ఆయన డుమ్మా కొట్టారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయ న విచారణకు రాలేదు. దీనిని సీబీఐ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయం దీనిపై తీవ్రంగా స్పందించింది.
అయితే మరోసారి అవినాష్ కు సీబీఐ అవకాశం ఇచ్చింది. కర్నూల్ లోని విశ్వ భారతి వైద్యశాలలో ఆయన తల్లితో ఉన్నారు. అక్కడే ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22న 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. ఎంపీ తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాకే సీబీఐ ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.