- ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు

Chandra babu security : టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు భద్రతకు తీసుకుంటున్న చర్యలో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితమే ఆయనపై రాళ్లదాడి జరిగి ఎన్ఎస్జీ కమాండో కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటలిజెన్స్, ఎన్ ఎస్జీ ముఖ్య అధికారులు రాష్ర్ట పోలీసులను హెచ్చరిస్తూనే ఉన్నారు.
చొచ్చుకొచ్చిన వైకాపా వాహనాలు..
తణుకు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తణుకు కు గురువారం సాయంత్రం రోడ్డు మార్గాన బయలుదేరారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు వద్ద చంద్రబాబు కాన్వాయ్ లోకి వైకాపా నేతలకు చెందిన వాహనాలు వచ్చి చేరాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడెం వరకు ఈ వాహనాలు ఆయనను అనుసరిస్తూ ఉన్నాయి. జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో చంద్రబాబు కాన్వాయ్ లోకి ఇలా రెండు వాహనాలు వచ్చి అనుసరించడం భద్రతా చర్యల్లో లోపాలను ఎత్తి చూపుతున్నాయి. చంద్రబాబు భద్రతను రాష్ర్ట పోలీసులు పట్టించుకోవడంలేదని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఎస్కార్ట్ గా ఉన్న స్థానిక పోలీసులు సైతం ఆ వాహనాలను ఆపకపోవడం విమర్శలకు తావిస్తున్నది. పోలీసులు వైసీపీ నేతల భద్రతకే ప్రాధాన్యతనిస్తున్నారని , పద్నాలుగేళ్లు సీఎంగా ఉండి, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుకు భద్రత (Chandra babu security) విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇలా ఇప్పటికే పలుమార్లు జరిగిందని, ఇటీవల రాళ్ల దాడి నుంచి కూడా తృటిలో తప్పించుకున్నారని వాపోతున్నారు. తమ నాయకుడి భద్రత విషయంలో వైసీపీ సర్కారు నిర్ల్యక్ష్యంగా వ్యవహరించడం టీడీపీ శ్రేణుల అగ్రహానికి కారణమవుతున్నది. వైసీపీ నాయకుల వాహనాలే కాన్వాయ్ లోకి చొచ్చుకు రావడం చూస్తుంటే అనుమానాలు రేకెత్తుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.