Megastar Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. అబుదాబిలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డ్స్ 2024 వేడుకలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ పురస్కారాన్ని నిర్వాహకులు ప్రధానం చేశారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ తోపాటు దక్షిణాది సినీతారలు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి టాప్ హీరోలు విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, యువ హీరోలు దగ్గుబాటి రానా, సుశాంత్, పలువురు నటీనటులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని రానా, బాలకృష్ణ అభినందించారు.
ఇదే వేడుకలో నందమూరి బాలకృష్ణ కూడా ‘గోల్డెన్ లెగసీ’ అవార్డు అందుకున్నారు. ఇక టాప్ హీరోయిన్ సమంతకు ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ ప్రధానం చేశారు. నేచురల్ స్టార్ నానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రతం ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో ఎంపికై పురస్కారం అందుకుంది
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. 46 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించినందుకు గాను చిరంజీవి ఈ రికార్డు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2024లో మరో ప్రతిష్టాత్మక పురస్కారం పొందడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.