
AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయారు. ఐదేళ్ల పాటు నియంతలా పాలించారు. అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. గాడి తప్పిన పాలనను సరిదిద్దే విధంగా.. అభివృద్ధికి మార్గాలను అన్వేషిస్తుంది. అదే విధంగా గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పలు అక్రమాలపై కూటమి సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారుల్ని ఇప్పటికే బదిలీలు చేయడంతో పాటు వారి స్ధానాల్లో సమర్థులైన అధికారుల్ని నియమిస్తోంది. అదే సమయంలో అక్రమాలపై వరుస విచారణలకు ఆదేశిస్తోంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు కూటమి సర్కార్ కు వైసీపీ తప్పిదాలను తవ్వితీసేందుకు తాజాగా మరో ఛాన్స్ ఇచ్చింది.
గతంలో కూడా ఇసుక అక్రమ తవ్వకాలపై ఉన్నతన్యాయస్థానం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని అప్పటి జగన్ సర్కార్‌ను సుప్రీం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భారీగా అక్రమాలకు తెరతీసిన వాటిలో ఇసుక మైనింగ్ కూడా ఒకటి. దీనిపై అప్పట్లో ఎన్జీటీ విచారణ జరిపి రూ.100 కోట్ల మేర జరిమానా విధించింది. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా తవ్వకాలకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. అంతే కాదు అప్పట్లో ఇసుక అక్రమాలపై విచారణ కూడా కొనసాగిస్తోంది.
ఇదే క్రమంలో అప్పటి అధికారులు ఇసుక తవ్వకాల్లో అక్రమాలే జరగలేదని ఇచ్చిన నివేదికతో క్షేత్రస్థాయి పరిస్ధితులు సరిపోలేదు. దీంతో గత పాలనలో ఇసుక అక్రమాలపై వాస్తవ పరిస్ధితుల ఆధారంగా తాజా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏపీ సర్కారును ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. ఆ లోపు ప్రభుత్వం అప్పట్లో ఇసుక తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.