Balakrishna vs Ambati :
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే వాడీవేడిగా మొదలై వాయిదా పడ్డాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పట్టు పట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు. ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో సభ మార్మోగింది. అయితే సభను స్పీకర్ వాయిదా వేసే వరకు పరిస్థితి వెళ్లింది.
సభ ప్రారంభం కాగానే, టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు పట్టు పట్టారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బాలకృష్ణ ను ఉద్దేశిస్తూ మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఇక్కడ మీసం మేలేయడం సరికాదని, అదేదో సినిమాల్లో చేసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు మండిపడడంతో, దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ఇక బాలకృష్ణ, అంబటిల మధ్య దమ్ముంటే చూసుకుందామని సవాల్ విసురుకునేదాకా పరిస్థితి వెళ్లింది. ఈ క్రమంలో టీడీపీ నేతలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం అంబటి చేశారు. తద్వారా టీడీపీ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే బాలకృష్ణ పై అంబటి వ్యవహరించిన తీరును అందరూ తప్పుబట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే ప్రయత్నం అంబటి చేశారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
మరోవైపు మరో మంత్రి బుగ్గన కూడా టీడీపీ నేతలను పదేపదే తప్పుబట్టారు. అన్ని విషయాలపై చర్చిద్దామని, సభ ప్రారంభం కాగానే ఇలా వ్యవహరించడం సరికాదంటూ మండిపడ్డారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. అక్రమ కేసులను ఎత్తేయాలని నినదించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో వాయిదా వేశారు. అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నినాదాలతో సభ మార్మోగింది.