AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ+జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తులో బీజేపీ కూడా కలుస్తుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ పొత్తు అంశంలో బీజేపీ తీవ్ర గందరగోళంలో పడింది. పొత్తు పెట్టుకుంటే సీట్లను ఎలా దక్కించుకోవాలో తెలియక ఏపీ బీజేపీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. ఇదే సమయంలో పొత్తు లేకపోతే పోటీ చేయడం కూడా వృథానే అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలా? లేక టీడీపీ+జనసేన కూటమితో కలిసే వెళ్లాలా? అనే అనుమానాలపై హై కమాండ్ ఎటూ తేల్చలేకపోతోంది. అందుకే ఇటీవల విడుదల చేసిన ఎంపీ స్థానాలకు సంబంధించి ఏపీలో అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ సారి అటు పార్లమెంట్.. ఇటు అసెంబ్లీలో ఏపీ నుంచి నేతలు అడుగుపెట్టాల్సిందేనని కసితో పని చేస్తున్నారు. కానీ ఒంటరిగా పోయే బదులు కూటమితో అయితేనే సక్సెస్ అవుతామని అనుకుంటున్నారు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ తో సహా మూడు పార్టీలు సిద్ధమయ్యాయి. బీజేపీ మాత్రం ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇప్పటి వరకూ కనీస ప్రచార ప్రణాళిక లేదు. ఒక్క బహిరంగసభ కూడా నిర్వహించలేదు. కేవలం చిన్నా చితకా కార్యక్రమాలు, ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యాయి. దీనికి కారణం పొత్తులు ఉంటాయన్న నమ్మకమే. అయితే కారణాలేంటో తెలియదు గానీ అడుగు ముందుకు పడడం లేదు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు అన్ని స్థానాల్లో పోటీ చేయడం సాధ్యం కాని విషయం. గతంలో మాదిరిగా.. ఒక్క చోట కూడా డిపాజిట్ వస్తుందన్న గ్యారంటీ కనిపించడం లేదు.