AP Cabinet Meeting :
ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అధికార పార్టీ వైసీపీ ఇటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. రేపటి నుంచి ఈ సమావేశాలు నిర్వహించబోతున్నది. బుధవారం మంత్రివర్గ భేటీ నిర్వహించబోతున్నది. అయితే ఇప్పుడు టీడీపీ కూడా కీలక భేటీకి సిద్ధమైంది. ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆ పార్టీపై పెద్ద ఎత్తున సానుభూతి ప్రజల్లో వచ్చింది. చంద్రబాబును వివిధ కేసులతో వేధించాలని ప్రభుత్వం చూస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని టీడీపీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా పై చేయి సాధించేందుకు సిద్ధమవుతున్నది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుపై కేసులు, అవినీతి, రానున్న ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన ప్రణాళికలపై వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది.
అయితే అసెంబ్లీలో అధికార పార్టీపై ఎదురుదాడికి టీడీపీ సిద్ధమవుతున్నది. చంద్రబాబు అరెస్ట్, కేసులు, వేధింపులపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా టీడీపీ నేతలు ప్రయత్నించనున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికలా చేసుకోవాలని పలువురు నేతలు భావిస్తున్నారు. ఇక టీడీఎల్పీ సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకోనున్నారు. పార్టీ క్యాడర్ కు సానుకూల సంకేతాలు అందేలా అసెంబ్లీలో కొట్లాడాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా సమాచారం. రెండు రోజుల క్రితం రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన యనుమలకు కూడా అధినేత ఇదే నిర్దేశించినట్లుగా తెలుస్తున్నది. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణ, చంద్రబాబుపై వేధింపులపై టీడీఎల్పీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ఈసారి హాజరైతే మొత్తం హాట్ హాట్ గా సమావేశాలు జరిగే అవకాశముంటుందనే అభిప్రాయం వినిపిస్తున్నది.