
ఏపీలో బడి పిల్లలకు ఈ రోజు నిజంగా పండుగే. ఏపీ ప్రభుత్వం బుధవారం అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 15వేలు జమ చేయబోతున్నది. ఇలా జమ చేయడం ఇది మూడోసారి. 2022 23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈరోజు ఖాతాలో వేయనుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నది చదువుకునే విద్యార్థుల కోసం జగనన్న దీవెన పథకం ద్వారా పేద కుటుంబంలోని పిల్లలు చదువుకునేందుకు ఫ్యామిలీపై ఆర్థిక భారం పడకుండా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అవకాశాలను కల్పిస్తున్నది. అలాగే అమ్మ ఒడి ద్వారా ఆర్థిక స్తోమత లేని తల్లులకు తమ పిల్లలను చదివించేందుకుగాను ప్రోత్సాహం అందిస్తున్నది.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. కురుపాంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచే అమ్మఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారులు అకౌంట్లలోకి జమ చేయనున్నారు. వరుసగా పది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 42 ,61,965 మంది తల్లుల ఖాతాల్లోకి రూ. 6392 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,347 మంది విద్యార్థులకు మేలు చేకూరుతుంది.
ప్రతి పేద విద్యార్థి బడికి వెళ్లాలని తల్లులందరికీ ఏటా రూ.15 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తున్నది. పాఠశాలలో డ్రాపౌట్స్ తగ్గించే కోసం ఈ పథకాన్ని నూరు శాతం అమలు చేస్తోంది. దీనికోసం విద్యార్థి హాజరు శాతం 75% ఉండాలి. దీనికి విద్యార్థుల తల్లులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. పేదింటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది.