
Nandamuri Balakrishna : తెలుగు సినిమా హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుందా? తాజాగా బాలయ్య పేరును పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ.. అన్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆయన నట వారసుడిగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 50సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా తన వంతు ప్రజా సేవ చేస్తున్నారు. అంతేకాదు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పొలిటికల్ హీరోగా కూడా రికార్డు సృష్టించారు. అంతేకాదు బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్ గా పేదలకు తక్కువ ఖర్చుతో కేన్సర్ వైద్యం అందిస్తూ హీరోగా.. ప్రజాప్రతినిధిగా తన వంతు కృషి చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలయ్య చేసిన సేవలకు గుర్తింపుగా 2025 సంవత్సరానికిగాను పద్మభూషణ్‌కు బాలయ్య పేరును ప్రతిపాదించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరానికి గాను ఏపీ నుంచి పలువురి పేర్లతో పాటు బాలయ్య పేరును ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసి కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఏపీతో పాటు కేంద్రంలోనూ ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆయనకు ఎప్పుడో రావాల్సిన ఈ అవార్డును ఆలస్యంగా ఇస్తున్నారని కూడా అంటున్నారు.