Task for Sharmila : కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం దాదాపు ఖాయమైపోయింది. ఇక షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోవడం లాంఛనమే. అయితే దీని వెనుక కాంగ్రెస్ తన భవిష్యత్ ప్రణాళికలతో వ్యూహాలకు పదును పెడుతున్నది. షర్మిల ను చేర్చుకోవడం ద్వారా తెలంగాణ లో బలపడడమే కాకుండా ఏపీలో మళ్లీ గత వైభవం తెచ్చేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తు్న్నది.
అయితే ఏపీలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన రెండు కలిసి జగన్ పై సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబుకు సహకరించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. తద్వారా 2029 నాటికి కాంగ్రెస్ క్యాడర్ ను మళ్లీ తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇక ప్రస్తుతం షర్మిలకు ఇదే టాస్క్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతున్నది.
అయితే షర్మిల ఎంట్రీని ఆపడం ఎవరితరం కాదు. తెలంగాణలో పోటీ చేయాలని అనుకుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్గం విభేదిస్తున్నది. కానీ కోమటిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఆమె చేరికను స్వాగతిస్తున్నారు. అయితే షర్మిలకు తెలంగాణ నాయతక్వం ఇస్తే బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందని అధిష్టానం వద్దకు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. దీంతో పలు సమాలోచనల తర్వాత షర్మిలకు ఏపీ, తెలంగాణలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
అయితే వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ వద్దని నాయకత్వం సూచించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ కు ఎంపీగా పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం కూడా ఇస్తామని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో ఇక ఏపీలో కూడా పూర్వవైభవం తేవాలని భావిస్తున్నది.
అందుకే 2024 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపిస్తే, జగన్ వెంట ఉన్న పాత కాంగ్రెస్ శ్రేణులంతా మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తారు. ఇదే కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తున్నది. ఏదేమైనా షర్మిలకు కాంగ్రెస్ పెద్ద బాధ్యతనే అప్పగిస్తున్నది. ఇప్పటికే అన్న జగన్ తో విభేదించిన ఆమెకు, అన్నను ఓడించే బాధ్యత కూడా అప్పగించబోతున్నది.