AR Rahman : సినీ ఇండస్ట్రీలో మరో ప్రముఖ జంట విడాకులు తీసుకోనుంది. సైరా బాను తన భర్త, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట తరపున ప్రముఖ న్యాయవాది వందనా షా విడాకుల నోటీసును జారీ చేశారు. “రెహమాన్, సైరా బాను చాలా సంవత్సరాల వారి వివాహా బంధాన్ని ముగించి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి సంబంధంలో మానసిక ఒత్తిడి ఉంది. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒకరికొకరు గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయి” అని న్యాయవాది వందనా షా అన్నారు.
విడాకుల గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ – “మా వివాహం త్వరలో 30 ఏళ్లకు చేరుకోవడం సంతోషంగా ఉంది. కానీ అది అనుకోకుండా ముగియవలసి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుడిని కూడా ప్రభావితం చేస్తాయి. విరిగిన ముక్కలు తిరిగి అతుక్కోలేవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్నేహితులు మన వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉంటే 1995లో సైరాను పెళ్లాడిన రెహమాన్.. వీరి వివాహం జరిగి 29 ఏళ్లు అవుతోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఖతీజా, రహీమా, అమీన్ వారి పిల్లలు. సైరాను పెళ్లి చేసుకోవాలని తన తల్లి నిర్ణయించిందని రెహమాన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. “సినిమాలకు సంగీతం అందిస్తూ చాలా బిజీగా ఉండేవాడిని. 29 ఏళ్ల వయసులో, పెళ్లి చేసుకుంటా, అమ్మాయిని చూడు అని అమ్మకు చెప్పాను” అని పేర్కొన్నారట. రెహమాన్ సినిమాల విషయానికొస్తే, అతను చివరిగా ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం రాయన్ కి సంగీతం అందించాడు.