Medaram Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులకు ఇలవేల్పు అయిన సమ్మక్క, సారాలమ్మ ప్రధాన దేవతలు. ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి కోట్లల్లో భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం మహా జాతర జరుగుతుందనే విషయం తెలిసిందే. రెండేండ్లకు ఒకసారి జరిగే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటుంది. గతంలోనే ఈ జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించింది.
ఈ ఏడాది జాతర ఫిబ్రవరి 21నుంచి జరుగనుంది. జాతర ప్రధానంగా మూడు రోజులు జరుగుతుంది. ఈ సమయంలోనే కొట్లాది భక్తులు తరలివస్తారు. మొదటగా సారాలమ్మ, ఆ తర్వాత సమ్మక్క తల్లిని గద్దెపైకి వస్తారు. ఆ తర్వాతి రోజు మొక్కులు ఉంటాయి. కోట్లాది భక్తులు తరలివచ్చే ఈ జాతరకు ఏర్పాట్లు కూడా ఘనంగానే చేస్తారు. కిలోమీటర్ల పరిధి భక్తుల క్యూలైన్లు, స్నానఘట్టాలు ఏర్పాట్లు చేస్తారు. ఈ జాతరకు వెళ్లడానికి ఆర్టీసీ 6వేలకు పైగా బస్సులను నడుపుతుంది. అలాగే లక్షలాది ప్రైవేట్ వాహనాల్లో వస్తారు. వేలాది పోలీసులు, ఇతర సిబ్బంది జాతర కార్యక్రమాల్లో భక్తులకు సేవలు అందిస్తుంటారు.
ఇక జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక గైడ్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. జాతరకు సంబంధించిన వివరాలు అందులో పొందుపరుచనున్నారు. పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, స్నానఘట్టాలు, ఆర్టీసీ బస్టాండ్, వసతులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడికి ఎలా చేరుకోవాలి? రూట్ వివరాలు, హెల్ప్ లైన్, ట్రాఫిక్ తదితర సమాచారం అందులో ఉండనుంది. త్వరలోనే ఈ యాప్ ను విడుదల చేయనున్నారు. ఇక మీరు కూడా ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని జాతరకు వచ్చే ఏర్పాట్లు చేసుకోండి మరి.