Arvinda Swamy :
పరిచయం అక్కర్లేని హీరో అరవింద స్వామి. హీరోల్లో అందగాడిగా పేరుపొందిన అతడు దక్షిణాదిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. 1991లో వచ్చిన దళపతి చిత్రంలో రజనీకాంత్, మమ్ముట్టిలతో నటించి శభాష్ అనిపించుకున్నాడు. తరువాత తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించాడు. వెండితెరకు పరిచయమైన అనతికాలంలోనే అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో తన ఉనికిని మరింత పెంచుకున్నాడు. బొంబాయిలో మనీషా కోయిరాలతో నటించి ఇంకా ఎదిగాడు. పాన్ ఇండియా స్టార్ గా తన ఇమేజ్ పెంచుకున్నాడు. తరువాత కాలంలో ఆయన హీరోగా వచ్చిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. బాక్సాఫీసు దగ్గర సినిమాలు బోల్తా కొట్టడంతో అరవింద స్వామి వ్యాపారం వైపు మళ్లాడు.
అరవింద స్వామి ఒకే తరహా కథలకే సరిపోతాయని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. డీలా పడిన అరవింద స్వామిని సినిమాలకు పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో అతడు సినిమాలు వదిలేసి వ్యాపారం వైపు దృష్టి పెట్టాడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. బోలెడు లాభాలు రావడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. బిజినెస్ లో దూసుకుపోయాడు.
2005లో పక్షవాతం రావడంతో నాలుగేళ్ల పాటు వ్యాపారానికి దూరంగా ఉన్నాడు. కానీ వ్యాపారాలను విస్మరించలేదు. చికిత్స తీసుకుంటూనే వ్యాపారాలను కొనసాగించాడు. ఇంకా వ్యాపారాన్ని విస్తరించాడు. పేరోల్ ప్రాసెసింగ్, టెంపరరీ స్టాఫింగ్ సేవలు అందించే ఈ సంస్థ ఆదాయం ప్రస్తుతం రూ 3300 కోట్లు ఉండటం గమనార్హం. అలా సినిమాలకు దూరమైనా ఇలా వ్యాపారంలో మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు.