Winning Lottery : ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి ‘గయానా’ అక్కడి నుంచి చాలా మంది యువకులు ఉపాధి, బతుకు దెరువు కోసం గయానాను వదిలి కెనడా వెళ్లారు. వారిలో చాలా మంది నార్త్ అమెరికాలో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో శివ్ మిసిర్.. హేమంత్ మిసిర్ కూడా ఉన్నారు. వీరు 1982లో గయానాను విడిచిపెట్టే వరకు వీరి వయస్సు వరుసగా 19, 16 సంవత్సరాలు.
39 ఏళ్ల తర్వాత, 2021లో వాళ్లు తమ దేశం గయానాకు వెళ్లాలనుకున్నారు. ఇటీవలి కాలంలో గయానా ఆర్థిక వ్యవస్థ బిలియన్ల పెట్రో డాలర్లను సృష్టిస్తుండడంతో ఈ అన్నదమ్ములు మళ్లీ ఇక్కడికి రావాలని కోరుకున్నారు. గయానా రాజధాని జార్జ్‌టౌన్‌లో ఖరీదైన ఆస్తులు అద్దెకివ్వడం.. కొనుగోళ్లు.., అమ్మకాలతో రియల్ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. గయానాలో చమురు నిక్షేపాల అన్వేషణ మొదలైన తర్వాత తిరిగి వచ్చిన ఆ దేశపు మధ్య తరగతికి చెందిన వారే శివ్, హేమంత్ మిసిర్.
గయానా ఒక సమయంలో బ్రిటీష్ కాలనీగా ఉండేది. చమురు నిక్షేపాల అన్వేషణ కారణంగా 2019 నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారింది.
నయా దుబాయ్..
దక్షిణ అమెరికాలోని సురినామ్, వెనెజులా మధ్య ఉన్న ఒక చిన్న దేశమే ‘గయానా’. ఇక్కడ జనాభా కేవలం 8 లక్షల మంది మాత్రమే. ఈ దేశ ప్రధాన పంట చెరకు. బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి 1966లో స్వతంత్ర దేశంగా మారింది. అమెరి చమురు సంస్థ ఎక్సాన్ మొబిల్ 2015లో గయానా తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలను గుర్తించింది.
ఆ తర్వాత ఎక్సాన్ మొబిల్, అమెరికన్ హెస్, చైనా దేశానికి చెందిన సీఎన్‌వోవోసీ సంస్థ కలిసి ఏర్పాటు చేసిన ఓ కన్షార్షియం గయానా తీరంలో 200 కిలో మీటర్లకు పైగా పరిధిలో చమురు బావులను తోడింది. ఇక్కడ 11 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఈ నిల్వలు 17 బిలియన్ బారెళ్ల వరకు ఉండొచ్చని అంచనాలు వేశారు.
బ్రెజిల్ చమురు నిల్వలు సుమారు 14 బిలియన్ బారెళ్లు కాగా, గయానావి అంతకంటే ఎక్కువ కావచ్చని ఈ అంచనాలు సూచిస్తున్నాయి. 2019 వరకు గయానా ప్రజలకు సాగు, వజ్రాల మైనింగ్, బంగారం, అటవీ ఉత్పత్తులే ప్రధాన ఆదాయ వనరు.
‘దేశం లాటరీని గెలుచుకున్నట్లు ఉంది’
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా ప్రకారం.. 2019 నుంచి 2023 మధ్య ఆ దేశ జీడీపీ 5.17 నుంచి 14.7 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. అంటే 184 శాతం పెరిగిందన్నమాట.
2022లోనే జీడీపీ 62 శాతంగా నమోదైంది.
‘ఆ దేశానికి లాటరీ తగిలినట్లే చమురు నిక్షేపాలు పడ్డాయి. ఇది ప్రస్తుతం అక్కడి ప్రజల జీవితంలో చాలా అరుదుగా వచ్చే అవకాశం’ అని గయానా, సురినామ్‌కు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి డిలెట్టా డోరెట్టి బీబీసీతో అన్నారు. చమురు ఉత్పత్తితో దేశ ఆర్థిక వ్యవస్థ ఇతర రంగాలు కూడా వృద్ధి చెందాయి. రాజధాని జార్జ్ టౌన్ లాంటి నగరాల్లో డెవలప్ మెంట్ తాలూకు ప్రభావం కనిపిస్తోంది. హాస్పిటల్స్ హైవేస్, బ్రడ్జిలు, పోర్ట్, వంటి సదుపాయాల ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. అమెరికాకు చెందిన మారియట్, బెస్ట్ వెస్ట్రన్ వంటి ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్ చైన్‌లు ఇక్కడ హోటళ్లను నిర్మిస్తున్నాయి.
కొత్త మధ్యతరగతి
ఈ ఆర్థికవృద్ధి కారణంగానే శివ్, హేమంత్ వంటి వాళ్లు శాశ్వతంగా కాకపోయినా గయానాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2021 నుంచి వారు తమ కొత్త వ్యాపారం కోసం తరచూ టొరంటో (కెనడా), జార్జ్‌టౌన్ మధ్య ప్రయాణం చేస్తున్నారు. చమురు ద్వారా వచ్చే డబ్బు వృద్ధి చెందుతున్న మధ్య తరగతిని, దేశంలో ప్రస్తుత ఉన్నత వర్గాలకు కొత్త అవకాశాలను ఇస్తుందని వారు భావిస్తున్నారు. ‘ప్రజలు ఇప్పుడు భద్రంగా ఉన్నారు. ఈ ప్రగతిలో తాము కూడా భాగమని భావిస్తున్నారు.’ అని శివ్ మిసిర్ చెప్పారు.
‘గయానాలో చాలా మంది రియల్ వ్యాపారంలో ఉన్నారు. లేదంటే ఆయిల్ బిజినెస్ చైన్‌లో పని చేస్తున్నారు’ అని వివరించారు. అమెరికా, కెనడాలోకు చెందిన అనేక మంది గయానీయులు తనకు తెలుసని, తమ దేశంలో చమురు ఉత్పత్తి మొదలైన తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు.
‘చాలా మంది గయానీస్ తిరిగి వస్తున్నారు. ఆధునిక హౌజ్ లు, ప్రైవేట్ సెక్యూరిటీ వంటి అనేక సౌకర్యాలు ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. చాలా మంది తమ జీవితంలో ఎక్కువ భాగం అమెరికా, కెనడాలో గడిపారు’ అని ఆయన చెప్పారు. దేశంలో కొనుగోలు శక్తి పెరిగింది, కానీ మోడ్రన్ షాపింగ్ మాల్స్ పూర్తి స్థాయిలో రాలేదని చెప్పారు.
అమెరికా, యూకే, యూరప్‌లలో విద్యాభ్యాసం
డచ్, బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న గయానాకు యూఎస్ తో వ్యాపార, సాంస్కృతిక సంబంధాలున్నాయి. అక్కడి నుంచి విమానంలో 4 గంటల ప్రయాణం చేస్తే అమెరికా చేరుకోవచ్చు. గయానా ధనికులు తమ పిల్లల చదువును అమెరికా, కెనడా, యూకే, యూరప్‌కు పంపిస్తుంటారు.
శివ్, హేమంత్ 2019లో స్థాపించిన రియల్ ఎస్టేట్ కంపెనీ జార్జ్ టౌన్‌లో వ్యాపార కలాపాలు మొదలు పెట్టారు. అదే ఏడాది ఆ దేశంలో చమురు నిల్వలు బయటపడ్డాయి.
చెరకు, వరి పండే ప్రాంతాలు ఈ దేశానికి ముఖ్యమైన సంపద వనరులు. కానీ, ఇప్పుడు జార్జ్‌టౌన్ శివారులో విలాసవంత గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి.
మారియట్, స్టార్ బక్స్‌లాంటి ఫ్రాంచైజీలు పుట్టుకొచ్చాయి.
ఏప్రిల్ 2023లో ప్రారంభమైన స్టార్‌బక్స్‌లో 50 మందికి పైగా ఉద్యోగులున్నారు. ‘దేశం ఇప్పుడు శక్తివంతమైన మార్కెట్’ అని బీబీసీతో అన్నారు స్టార్‌బక్స్ ప్రతినిధి.
జనాభాలో 39.8 శాతం మందికి భారతీయ మూలాలు
17, 19 శతాబ్దాల మధ్య చక్కెర ఉత్పత్తి చేసేందుకు ఆఫ్రికన్ బానిసలను ఉపయోగించుకున్న యూరోపియన్లు గయానాను తమ వలస రాజ్యంగా చేసుకున్నారు. 1833లో బానిసత్వం రద్దు కావడంతో బ్రిటిష్ సామ్రాజ్యం తూర్పు ఆసియా నుంచి భారత్, చైనా, పోర్చుగీస్ నుంచి గయానాకు వలస కూలీలను తీసుకొచ్చింది. ఇలా వచ్చిన వారిలో 39.8 శాతం మందికి భారతీయ మూలాలున్నాయి. 30 శాతం మంది ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు, 10.5 శాతం స్థానికులు, 0.5 శాతం మంది ఇతర మూలాలున్నవారు ఉన్నారు.
వరల్డ్ బ్యాంక్ ఇటీవల సేకరించిన డేటా ప్రకారం, దక్షిణ అమెరికాలో ప్రజల మధ్య అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో గయానా, సురినామ్ ముందు వరుసలో ఉన్నాయి. భారతీయ మూలాలున్న వ్యాపారి రిచర్డ్ సింగ్ జార్జ్‌టౌన్‌లో వాడిన ఇంపోర్టెడ్ కార్ల బిజినెస్ చేస్తున్నారు. సిటీ సెంటర్‌లో ఉన్న ఆయన షోరూంలో 20కి పైగా విదేశీ కార్లు ఉన్నాయి. ఆయనకు బాల్య నుంచి కార్లు, టెక్నాలజీ అంటే చాలా ఇష్టం.
రిచర్డ్ సింగ్ జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న సెకండ్ హ్యాండ్ కార్లనే ఎక్కువగా సేల్ చేస్తుంటాడు. జపాన్ దేశంలో లాగానే గయానాలో కూడా కార్లకు కుడి వైపునకు స్టీరింగ్ ఉంటుంది. చమురు కారణంగా ఆదాయం పెరిగినా.. చాలా మంది ధనవంతులు ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కార్లు కొనడానికి ఇష్టపడతారని సింగ్ చెప్పారు.
ఎందుకంటే కొత్త కార్లు కొంటే ఇక్కడ పన్నులు ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. పైగా విడిభాగాలు కూడా దొరకవు. దీంతో సెకండ్ హ్యాండ్ బెటర్. జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న బీఎండబ్ల్యూ కార్లు ఆయన షోరూంలో కనిపిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు గుర్తించినప్పటి నుంచి దేశపు కస్టమర్ల వైఖరిలో మార్పు వచ్చిందన్నారు.
‘మా షోరూంకు ఇప్పుడు కేవలం పెద్ద పెద్ద వ్యాపారులు మాత్రమే కాదు.. చాలా మంది వస్తున్నారు’ అన్నారు రిచర్డ్ సింగ్. చమురు, గ్యాస్ పరిశ్రమకు చెందిన విదేశీయులు వస్తుండంటో వారి కోసం కార్లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది.
గయనా ధనవంతుల లైఫ్ స్టైల్ పై అవగాహన ఉన్న రిచర్డ్ సింగ్, దేశంలో కొత్త మధ్య తరగతి వర్గం పుట్టుకొస్తోందని చెప్పారు. గతంలో ఫార్ములా1 రేసులు చూసేందుకు తాను మయామీ వెళ్లేవాడినని, తమ దేశం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని ఆయన అన్నారు. తమ దేశాన్ని దుబాయ్‌తో ఏ మాత్రం తక్కువ కాదని ఆయన అన్నారు.
‘నేను దుబాయ్ గురించి చాలా విన్నా. 90లలో అది ఎడారి భూమి. ఇప్పుడు మీరు గుర్తు పట్టలేరు’’ అన్నారు రిచర్డ్ సింగ్. ‘20 ఏళ్ల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే, ఇది గయానా..? అనే ప్రశ్న మొదలవుతుంది. అది మా ఆశయం.. అది జరిగి తీరుతుందని అనుకుంటున్నా’ అన్నారాయన.