
Karnataka News : నేటి సమాజంలో మానవత్వం కరువైంది. నా అన్నవాళ్లే ఆస్తుల కోసం, పగల కోసం, ప్రేమల కోసం, వివాహేతర సంబంధాల కోసం, పరువు కోసం చంపేస్తున్నారు. భార్యను భర్త, భర్తను భార్య, తల్లిదండ్రులను పిల్లలు, పిల్లలను తల్లిదండ్రులు అంతమొందిస్తున్నారు. దేశంలో ప్రతీ నిమిషం ఏదో ఒక చోట హత్యలు జరుగుతూనే ఉండడం బాధాకరం.
కర్నాటకలోని తుమకూరు జిల్లాలోని కులినంజయ్యన్ గ్రామంలో నాలుగు రోజుల కింద జరిగిన ఉపాధ్యాయుడు మరియప్ప(47) హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో వెల్లడైన విషయాలు షాకింగ్ గురిచేస్తున్నాయి. మనుషులు ఇలా కూడా ఉంటారా? అని ప్రతీ ఒక్కరూ ఆవేదన చెందుతున్న దారుణ సంఘటన ఇది..
ఫిబ్రవరి 9న మోడూరు పాఠశాలలో గెస్ట్ టీచర్ గా పనిచేస్తున్న మరియప్పను తుముకూరు జిల్లా కుణిగల్ తాలుకాలోని పొలంలో దారుణంగా నరికి చంపారు. మరియప్పను ఎవరైనా పగతో చంపి ఉంటారని పోలీసులు మొదటగా అనుమానించారు. ఆ నేపథ్యంలో విచారణ ప్రారంభించారు. అనేక ట్విస్ట్ ల తర్వాత అసలు నిజం తెలిసి నివ్వెరపోయారు. మరియప్ప హ్యత కేసులో ఆయన భార్య, కూతురితో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
ఉపాధ్యాయుడు మరియప్ప అతడి భార్య శోభా, కూతురు హేమాలతతో కలిసి పేదరికంలో ఉన్నా చాలా హాయిగా జీవిస్తున్నారు. అయితే ఎదిగిన కూతురు హేమలత అదే గ్రామానికి చెందిన శాంతకుమార్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే వీరి ప్రేమకు తల్లి శోభా అంగీకరించినా తండ్రి ఒప్పుకోలేదు. కోపంతో శాంతకుమార్ ను కొట్టాడు. దీంతో మరియప్పపై అతడి కుమార్తె బాయ్ ఫ్రెండ్ శాంతకుమార్ ద్వేషం పెంచుకున్నాడు. మరియప్పపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. బెంగళూరులో నివాసముంటున్న తన స్నేహితులతో కలిసి మరియప్పను చంపడానికి స్కెచ్ రెడీ చేశాడు.
ఈ విషయం ప్రేమికురాలు హేమలతకు, ఆమె తల్లి శోభాకు కూడా చెప్పాడు. వారు కూడా దీనికి అంగీకరించారు. సొంత భర్త, సొంత తండ్రి హత్యకు వీరు అంగీకరించడమే ఇక్కడ గుండెలను కలిచివేసే అంశం. ఇక వీరి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మరియప్పను చంపేందుకు శాంతకుమార్ సుపారీ ఇచ్చాడు.
మరియప్ప కదలికలపై తల్లీకూతుళ్లు కలిసి శాంతకుమార్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు. హత్య జరుగబోతున్న రోజు..మరియప్ప అమావాస్య పూజలు ముగించకుని సొంత గ్రామానికి వస్తున్నాడని భార్య శోభా, ప్రియురాలు హేమలత.. శాంతకుమార్ కు సమాచారం అందించారు.
గ్రామ పొలిమేరలోకి మరియప్ప బైక్ పై చేరుకుంటుండగా దుండగులు మరియప్ప ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లారు. భయంతో బైక్ దిగి పారిపోబోయిన మరియప్పను వెంబడించి.. వేటాడి దుండగులు ఆయన్ను కిరాతకంగా నరికి చంపారు. ఈ కేసు విచారణను పూర్తి చేసిన పోలీసులు మరియప్ప భార్య శోభా, కూతురు హేమలత, ప్రియుడు శాంత కుమార్, మిగతా నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.