
Australia vs Oman : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా బార్బడోస్ లో జరిగిన ఆస్ట్రేలియా, ఓమన్ లీగ్ మ్యాచ్ లో కంగారుల టీం అలవోక విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు షాక్ ఇస్తూ ఓమన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భీకర ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ ను 12 పరుగులకే పెవిలియన్ చేర్చగా.. ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మ్యాక్స్ వెల్ ను 0 పరుగులకే ఔట్ చేశారు.
దీంతో ఆసీస్ 8.3 ఓవర్లలోనే 50 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 56 పరుగులతో రాణించగా.. మార్కస్ స్టోయినిస్ ఆరు సిక్సులు, ఒక ఫోర్ తో 36 బంతుల్లోనే 67 పరుగులు చేయగా.. ఆసీస్ 164/5 తో ఇన్సింగ్ ముగించింది.
కఠినమైన పిచ్ పై ఆసీస్ బ్యాటర్లే రన్స్ చేయడానికి ఇబ్బందులు పడగా.. ఓమన్ బ్యాట్స్ మెన్ ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. ఓమన్ ఓపెనర్లు ఫెయిల్ కావడంతో ఆరు పరుగులకే మొదటి వికెట్ కోల్పోగా.. 34 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆచి తూచి ఆడిన ఓమన్ బ్యాటర్లు గెలిచేందుకు కాకుండా స్కోరు అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు.
అయాన్ ఖాన్ 2 సిక్సులు, రెండు ఫోర్లతో 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మెహ్రన్ ఖాన్ 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులు బాది 27 పరుగులు చేశాడు. కేవలం నలుగురు బ్యాట్స్ మెన్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. ఓమన్ 20 ఓవర్లలో 125 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ ప్యాట్ కమిన్స్ ను బెంచ్ కే పరిమితం చేయగా.. నాథన్ ఇల్లియాస్ ను తీసుకుంది. మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు, 67 పరుగులతో రాణించగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.