
Avinash bail : కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మరి కాసేపట్టో నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ శ్రేణులు, ఏపీ ప్రజల దృష్టంతా అటు వైపే పడింది. మరోవైపు బెయిల్ ఇవ్వకుంటే అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఏర్పాట్లు చేసుకుంటున్నది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అవినాష్ ను నిందితుడిగా పేర్కొంటూ విచారిస్తున్నది. అయితే ఇటీవల విచారణకు పిలిచిన మూడు సార్లు అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీనిని సీబీఐ సీరియస్ గా తీసుకుంది.
అవినాష్ రెడ్డి తల్లి గుండె సంబంధిత ఇబ్బందితో దవాఖానలో చేరింది. ఆమెకు తోడుగా అవినాష్ అక్కడే ఉంటున్నారు. ఇదే కారణంతో విచారణకు కూడా రావడం లేదు. అయితే ప్రస్తుతం దవాఖాన వద్ద ఉద్రిక్త పరిస్థితి ఉంది. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు అవినాష్ కు బెయిల్ ఇవ్వవద్దంటూ వైఎస్ వివేకా కూతురు సునీత ఇందులో ఇంప్లీడ్ అవుతున్నట్లు సమాచారం. ఆమె తరపున న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టుకు చేరుకున్నట్లు తెలిసింది.
అయితే హైకోర్టు బెయిల్ ఇస్తే ఇది అవినాష్ రెడ్డికి పెద్ద ఊరటలాగే భావించవచ్చు. ఒకవేళ పిటిషన్ ను తిరస్కరిస్తే ఇక అవినాష్ అరెస్ట్ ఖాయమవుతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సీబీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరి ఈ సాయంత్రం ఈ అంశంపై సీబీఐ ముందుకెళ్తుందా.. లేదంటే హైకోర్టు తీర్పుతో ఆగిపోతుందా తేలనుంది.
అయితే రెండు రోజుల క్రితమే అవినాష్ అరెస్ట్ కు సంబంధించి సీబీఐ ముందుకెళ్లింది. కర్నూల్ ఎస్పీకి సమాచారం అందజేసింది. కానీ కొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వెనుకడుగు వేసినట్లు సమాచారం. మరోవైపు కర్నూల్ పోలీసులు కూడా సహకరించకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది.