
Avinash Reddy-CBI : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐకి జలక్ ఇచ్చారు. ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇప్పటికే వరుసగా 16,19 తేదీల్లో సీబీఐ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినా, ఆయన వివిధ కారణాలతో రాలేదు. అయితే 22న విచారణకు రావాలని మూడోసారి సీబీఐ నోటీసులు ఇవ్వగా తాను రాలేనని అవినాష్ సీబీఐకి సమాచారం అందించారు. హైదారాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఆయన సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఆయన కర్నూలులోనే ఉన్నట్లు సమాచారం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పటికే సీబీఐ ఐదుసార్లు ఆయనను ప్రశ్నించింది. ఇక 16, 19 తేదీల్లో రావాలని పిలిచినా, ఆయన హాజరుకాలేదు. ఈనెల 19న తన తల్లికి గుండెపోటు వచ్చిందని, దవాఖానలో తన వెంట ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే సీబీఐ ఈనెల 22 సోమవారం విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. తన తల్లి ఆరోగ్యం బాగయ్యేంతవరకు తాను రాలేనని, పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన సీబీఐని కోరారు. అయితే అవినాష్ విషయంలో ఇప్పటికే సీరియస్ గా ఉన్న సీబీఐ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి.
అరెస్ట్ ఖాయమనే అనుమానంతోనే అవినాష్ సీబీఐకి ఎదురపడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీబీఐ ఇలా నోటీసులు ఇస్తూనే వెళ్తుందా.. లేదంటే రెండు, మూడు రోజుల సమయం ఇస్తుందా.. లేక అదుపులోకి తీసుకుంటుందా అనేది సోమవారం తెలియనుంది. ఇప్పటికే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం కూడా అవినాష్ రెడ్డి తీరును సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.