
CBI in High Court : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ సాగుతున్నది. మూడు రోజులుగా సాగుతున్న ఈ విచారణలో శనివారం సీబీఐ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అవినాష్ ను అరెస్ట్ చేయాల్సిందేనని, ముందస్తు బెయిల్ ఆయనకు ఇవ్వొద్దని కోరుతున్నారు. కేసు దర్యాప్తులో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని, దర్యాప్తు జాప్యం చేసి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. తాను కోరుకున్నట్లే విచారణ జరగాలని అవినాష్ భావిస్తున్నారని తెలిపింది. దీంతో పాటు పలు సంచలన విషయాలు సీబీఐ వెల్లడించింది.
వైఎస్ వివేకా హత్యకు నెల క్రితమే ప్రణాళిక జరిగినట్లు సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుట్రలో ప్రమేయం ఉన్న పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, కానీ అవినాష్ మాత్రం తమకు సహకరించడం లేదని తెలిపారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారిస్తేనే మరికొన్ని విషయాలు, మరికొందరి ప్రమేయం బయటకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే మిగతా వారికి లేని అవకాశం అవినాష్ కు ఎందుకివ్వాలని న్యాయవాది అనిల్ హైకోర్టు లో వాదించారు. అయితే వాదనలను సీబీఐ ఎస్పీతో పాటు మరికొందరు అధికారులు, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత స్వయంగా హాజరై వింటున్నారు.
అయితే సీబీఐ తాజాగా వేసిన కౌంటర్ సంచలనం సృష్టించింది. ఏపీ సీఎం జగన్ పేరును కూడా అందులో చేర్చింది. హత్య విషయం జగన్ కు ఉదయం ఆరు గంటలకే తెలిసిందని చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మరి రానున్న రోజుల్లో మరెన్ని విషయాలు బయటకు వస్తాయోనని అంతా చర్చించకుంటున్నారు. అయితే జూన్ 30లోగా వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను ముగించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు గడువు నిర్దేశించింది.