
Kanuri Seshu Madhavi : ‘సేవ’ అనే పదం రెండక్షరాలే అయినా.. ఒక జీవితం మొత్తం పెట్టినా సరిపోదేమో. తనకు తాను బతికడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో ఇతరులకు సేవ చేయాలనే సంకల్పం తీసుకోవడం గొప్ప విషయం. అలాంటి గొప్ప పనులు చేసేందుకు చాలా తక్కువ మంది ముందుకు వస్తుంటారు. వారిలో ‘కానూరి శేషు మాధవి’ ఒకరు.
కానూరి శేషు మాధవి అమ్మ చిల్డ్రన్ హోమ్, బీకేఆర్ వృద్ధాశ్రమంను గన్నేరువరంలో ఏర్పాటు చేశారు. ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మాధవి. అనాథ పిల్లలను, వృద్ధులను అక్కున చేర్చుకొని వారి ఆలనా పాలనా చూసుకుంటుంది. ఎవరూ లేని వారికి అన్నీ తానవుతుంది. చిన్నారులను చదివించడంతో పాటు అనాథ ప్రేతాలకు దహన సంస్కారం కూడా నిర్వర్తించి గొప్ప వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకుంది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని ఎంపవర్ అండ్ ఎక్సెల్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు చరగుళ్ల అయేషా అమ్మ చిల్డ్రన్ హోమ్ లో జాతీయ జెండా ఎగురవేశారు. ఆమె మాట్లాడుతూ అనాథలకు సేవలు అందిస్తున్న ఆశ్రమ చైర్మన్ శేషు మాధవిని అభినందించారు.
ఆశ్రమ చిన్నారుల్లో జాతీయ భావాలు, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను అనాథ శరణాలయంలోని అనాథ పిల్లల మధ్య గడపడం సంతోషంగా ఉందన్నారు. వృద్ధులు, చిన్నారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బోకినాల అశోక్, శ్రీమన్నారాయణ, నాగబాబు, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.