అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః
హరిహర పుత్రాయ నమః
కరుణా సముద్రాయ నమః
బ్రహ్మాండ రూపాయ నమః
అంటూ ఆ హరిహర పుత్రుడిని స్మరించుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. శివ విష్ణుల సుతుడైన అయ్యప్ప స్వామి ఖ్యాతి ఖండాంతరాలను దాటుతోంది. ఒకప్పుడు కేరళకు మాత్రమే పరిమితమైన అయ్యప్పస్వామి మాల ధారణ క్రమేణా యావత్ భారతాన మహోజ్వలంగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడేమో ఖండాలను దాటుతూ అగ్రరాజ్యం అమెరికాలో సైతం స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోష తో అయ్యప్ప నామ స్మరణతో మారుమ్రోగుతోంది. భక్తికి జాతి , మతం , ప్రాంతీయత లేదని సర్వమత సమ్మేళనంగా అవతరించింది.
తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీలోగల ఎడిసన్ లో అయ్యప్పస్వామి మహా పడి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎడిసన్ లోని సాయి దత్త పీఠం , శ్రీ శివ విష్ణు టెంపుల్ లో అయ్యప్పస్వామి మహా పడి పూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహా పడిపూజకు పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు , అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తారు. అయ్యప్పస్వామి పడి పూజోత్సవాలు అమెరికాలోని న్యూజెర్సీ, పెన్సిల్వేనియా , న్యూయార్క్ మూడు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు అందరూ పెద్ద ఎత్తున ఎడిసన్ లోని సాయి దత్త పీఠం లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప భజనలను చేశారు.
ఇక నాన్ అయ్యప్పలు కూడా పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. JSW & Jaiswaraajya సంస్థల అడ్వైజర్, Ublood app ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి , సాయి దత్త పీఠం ఫౌండర్, చైర్మన్ శ్రీ రఘు శర్మ శంకరమంచి, ఉపేంద్ర చివుకుల తదితర ప్రముఖులు హాజరై అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 18 న జరిగింది.