Balagam Movie :
బలగం ఒక స్ఫూర్తిదాయక విజయగాథ. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ చిన్న సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కమెడియన్ వేణు యెల్దండి దర్శకుడిగా పరిచయమై తెరకెక్కించిన మొదటి సినిమా ఇది. దీంతో ఆయనకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు దక్కింది. ఆయన క్రియేటివిటీకి అందరూ షాక్ అయ్యారు.
బలగం పూర్తి స్టోరీ కథ మొత్తం తెలంగాణ బతుకు చిత్రం, జీవన విధానాన్ని చూపిస్తుంది. కుటుంబాల మధ్య బంధాలు వాటిలోని అనుబంధాలను ప్రతిభింబిస్తుంది. ఈ రోజుల్లో డబ్బు, అహం కుటుంబ బంధాలను ఎలా నియంత్రించగలిగాయో బలగం చూపించింది. దాన్ని అంతే అందంగా చిత్రీకరించాడు డైరెక్టర్ వేణు. చనిపోయిన వారికి పెట్టిన ఆహారాన్ని పక్షి ముట్టుకోకపోవడం కథతో ఈ చిత్రాన్ని తీసిన వేణు దీని చుట్టూనే స్టోరీని అల్లి అందంగా ప్రజెంట్ చేశారు.
ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రాం హీరో హీరోయిన్లుగా నటించారు. మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు లీడ్ రోల్స్ పోషించారు. దిల్ రాజు బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించారు. బలాగం బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు ఓటీటీ ప్లాట్ ఫాంలో కూడా భారీగా రాబట్టింది. గ్రామాలల్లో తెరలు ఏర్పాటు చేసి చిత్రాన్ని ప్రదర్శించారు నిర్మాతలు. అక్కడ కూడా భారీగానే విజయం దక్కించుకుంది.
ఇప్పుడు మరింత ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, బలగం వివిధ విభాగాల్లో వివిధ దేశాల్లో 100+ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఒక చిన్న ప్రాంతీయ చిత్రం వివిధ దేశాల్లో అంతర్జాతీయ గుర్తింపును పొందడం నిజంగా అరుదైన, గర్వించదగిన విజయం అనే చెప్పాలి.