
Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, నందమూరి బాలకృష్ణతో కలిసి నటించిన ‘విజయేంద్ర వర్మ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. పొరపాటున బాలకృష్ణ కాలు తొక్కడంతో ఆయన తనపై సీరియస్ అయ్యారని, దాంతో తాను భయపడి ఏడ్చేశానని లయ తెలిపారు.
లయ మాట్లాడుతూ, “‘విజయేంద్ర వర్మ’ షూటింగ్ తొలి రోజే మా ఇద్దరికీ సంబంధించిన పాట చిత్రీకరణ జరుగుతోంది. రిహార్సల్స్ చేస్తుండగా అనుకోకుండా నేను బాలకృష్ణ గారి కాలు తొక్కేశాను. దాంతో ఆయన ఒక్కసారిగా నా వైపు చూసి, సీరియస్‌గా ‘నా కాలే తొక్కుతావా? ప్యాకప్ చెప్పండి.. ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి’ అన్నారు. ఆయన అప్పటివరకు నాకు అంత సీరియస్‌గా కనిపించకపోవడం, ఆ మాట అనడంతో నేను నిజంగానే భయపడిపోయి ఏడ్చేశాను.” అని వివరించారు.
అయితే, తాను ఏడవడం గమనించిన బాలకృష్ణ వెంటనే తన దగ్గరకు వచ్చి, “అయ్యో, ఏడుస్తున్నావా? నేనేదో సరదాగా అన్నాను. ఇలా షూటింగ్‌లలో కాళ్లు తొక్కడం కామన్. చిన్న చిన్న వాటికి ఏడవకూడదు” అంటూ తనను ఓదార్చారని లయ చెప్పారు. బాలకృష్ణ సరదాగా చేసిన ఆ వ్యాఖ్యలకు తాను నిజంగానే భయపడిపోయానని, కానీ ఆ తర్వాత ఆయన ఎంత సరదా మనిషో అర్థమైందని లయ ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటన బాలకృష్ణ సెట్స్‌లో ఎంత క్రమశిక్షణతో ఉంటారో, అదే సమయంలో తన సహనటులతో ఎంత సరదాగా ఉంటారో తెలియజేస్తుంది.