Balineni Srinivas Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామా చేశారు. అంతేకాకుండా.. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యమన్నారు. తన రాజీనామా లేఖలో సంచలన విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలపై బాలినేని కాస్త నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో తనను మంత్రి పదవి నుంచి తప్పించడంతో బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారని కూడా వార్తలు వచ్చాయి.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రి అయిన వ్యక్తిపై జగన్ తీరు సరికాదన్నారు. రాజకీయాల్లో భాష, విలువలు పాటించాలన్నారు. ప్రస్తుతం అవి వైసీపీలో కొరవడిపోయాయని అన్నారు. రాజకీయాలు, బంధుత్వాలు వేరన్నారు. ఇక్కడ ఉండలేక పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా బాలినేని పార్టీని వీడుతారని.. వైఎస్ జగన్ పలుమార్లు ఆయనతో బుజ్జగింపు కార్యక్రమాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఎప్పటికైనా పార్టీ నుంచి జంప్ చేయడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే బాలినేని… ఈరోజు పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
మరోవైపు ఆయన జనసేనలో చేరనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో బాలినేని వర్గం టచ్‌లోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. రేపు జనసేన పార్టీ అధినేతతో కలిసి పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఏపీలో జగన్ కు వరుస షాక్ లు తగులుతున్నాయని చెప్పవచ్చు. ఓ వైపు సొంత పార్టీ నేతలే పార్టీలను చీల్చి చెండాడుతున్నారు.
వాళ్లంతా తన పార్టీని ఏం చేస్తారో అని జగన్ కి నిద్ర పట్టడం లేదు. మరోవైపు జగన్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జగన్ సీఎంగా ఉండగా.. అడ్డగోలుగా చేసినటువంటి అక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం బయటకు తీస్తుంది. ఇక తన సోదరి వైఎస్ షర్మిల గ్యాప్ దొరికితే తన పదునైన మాటలతో, విమర్శలతో అన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముంబైకి చెందిన నటి జెత్వానీ కేసులో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి సీఎం చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధానిపై మాట్లాడుతున్న చంద్రబాబుపై వైసీపీ వాళ్లు మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.