Eating Sitting on the Floor : పూర్వం రోజుల్లో ఇంటిల్లిపాది కుటుంబంతో సహా అందరం కింద కూర్చుని భోజనం చేసేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్లం. దీంతో మన ఆరోగ్యం బాగుండేది. నేల మీద కూర్చుని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం తినే పద్ధతి కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నేల మీద కూర్చుని తింటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కింద కూర్చుని తినడం అలవాటు చేసుకుంటే కండరాల్లో కదలిక పెరిగి ఆరోగ్యంగా తయారవుతాం.
కింద కూర్చుని పళ్లెం ముందు పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. భోజనం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం నమిలి మింగడానికి వెనక్కి రావడం వంటి ప్రక్రియ వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి కావడానికి అనుకూలంగా ఉంటుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఇది కీలకంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
నేల మీద కాళ్లు ముడుచుకుని కూర్చుని తినడం వల్ల శారీరక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చక్కని శరీరం మన సొంతం అవుతుంది. నేలమీద కూర్చుని తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినడం వల్ల ఎంత తిన్నామో కూడా తెలియదు. మనకు సరిపోయేంత తిన్నా కూడా తెలియదు. పొట్ట నుంచి వచ్చే సిగ్నల్స్ రాకుండా పోతాయి.
కింద కూర్చుని తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల కుటుంబ సభ్యుల్లో బంధాలు బలపడతాయి. నడుమునొప్పి, కీళ్లనొప్పులు దూరమవుతాయి. వైద్యుల సలహా మేరకు కింద కూర్చుని తింటేనే ఎంతో హాయిగా ఉంటుందని చెప్పనక్కర్లేదు. దీంతో కింద కూర్చుని తినడానికే మొగ్గు చూపాల్సి ఉంటుంది. ఇలా కింద కూర్చుని తినడం వల్ల ఎంతో లాభం ఉందని తెలుసుకోవచ్చు.