
Betting apps Case : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇటీవల కొందరు సినీ తారలు, ప్రముఖులు బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి దాదాపు 25 మంది సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఇప్పటివరకు నిందితులుగా భావించిన సెలబ్రిటీలకు ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసులు తాజాగా 19 మంది బెట్టింగ్ యాప్ యజమానులపై కేసులు నమోదు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నోటీసులు అందుకున్న 25 మంది సెలబ్రిటీలను నిందితులుగా కాకుండా కేవలం సాక్షులుగా మాత్రమే పరిగణించనున్నారు. ఈ పరిణామం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు.