Bhogapuram Airport Work : భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయం గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెల్లడించారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, భోగాపురంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం డిసెంబర్ 2026 నాటికి పూర్తి కావడానికి ఆరు నెలల ముందు జూన్ 2026 నాటికి పనిచేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులను 2026 నాటికల్లా పూర్తి చేస్తామని ప్రకటించినా, అంతకన్నా ముందే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ టెర్మినల్, రన్ వే, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. 2024 డిసెంబర్ కల్లా టెర్మినల్ భవనం పూర్తి చేస్తామని ప్రకటించారు. అలాగే 2026 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, అందుబాటులోకి తెస్తామని అప్పుడు స్పష్టం చేశారు. మరోసారి కేంద్రమంత్రి భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులను పరిశీలించారు. పనుల పురోగతి వివరాలను కాంట్రాక్ట్ కంపెనీ టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు. అనుకున్న దాటికంటే ఆరునెలలు ముందుగానే పని చేయాలని సంకల్పించామని కేంద్ర మంత్రి చెప్పారు.
భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఆరు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయలేక, గడువులు పెంచుకుంటూ పోవడంతో ఏపీ అభివృద్ధిలో వెనుబడింది. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై దృష్టి సారించింది. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
రూ. 4,700 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు 2015లో అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా, ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం 2016లో అవసరమైన అనుమతులను మంజూరు చేసింది, నిర్మాణానికి 2,700 ఎకరాల భూమిని సేకరించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2023లో పూర్తి కావాల్సి ఉండగా, 2019లో టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ గద్దెనెక్కడంతో నిర్మాణం ఆలస్యమైంది. 2024లో తిరిగి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ పనుల్లో వేగం పుంజుకున్నాయి.