
Ganapati Pooja : గణేశ్ నవరాత్రోత్సవాలు దేశ వ్యా్ప్తంగా సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దివి నుంచి భువికి వచ్చిన గణనాథుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. స్వామి వారిని కొలిచేందుకు వీధులు, వాడలు మామిడి తోరణాలతో అందంగా ముస్తాబయ్యయి. ఆదివారం రాత్రి గణపతి విగ్రహాలను మండపాలకు తీసుకువచ్చిన భక్తులు స్వాగతాలను కూడా అంతే ఘనంగా నిర్వహించారు. డీజేలు, డబ్బు చప్పుళ్లతో స్వామిని మండపానికి ఆహ్వానించారు.
కొంగు బంగారంగా కొలువైన స్వామిని అందంగా అలంకరించిన మండపంలో సోమవారం ఉదయం ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం వేళ భజనలు చేసి స్వామి నామాన్ని కీర్తించారు. ఆయా పార్టీల నాయకులు, అధినేతలు పార్టీ కార్యాలయాలు, ఇండ్లలో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేడుకలు వైభవంగా కొనసాగాయి. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతికి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయమే కార్యాలయానికి వచ్చిన ఆమె స్వామి వారిని దర్శించుకొని వ్రత కథ విన్నారు. తర్వాత స్వామి వారికి నైవేద్యం సమర్పించి రాష్ట్రాన్ని, దేశాన్ని, సమస్త జీవకోటిని ఆనందంగా చూడాలని వేడుకున్నారు.